మార్కెట్ బుల్‌ బుల్‌- సరికొత్త రికార్డ్స్‌

మార్కెట్ బుల్‌ బుల్‌- సరికొత్త రికార్డ్స్‌

నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్‌వచ్చింది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగారు. దీంతో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో కదం తొక్కాయి. ఫలితంగా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,000 మార్క్‌ను సులభంగా దాటేసింది! ఆపై ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ గత వారం నికరంగా మార్కెట్లు 4 శాతం ఎగశాయి.

1500 పాయింట్లు ప్లస్‌
గత వారం సెన్సెక్స్‌ 1504 పాయింట్లు జంప్‌చేసింది. 39,435 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 437 పాయింట్లు జమ చేసుకుని 11,844 వద్ద స్థిరపడింది. గురువారం ఒక దశలో సెన్సెక్స్‌ 40,125 వరకూ దూసుకెళ్లగా, నిఫ్టీ 12,041ను తాకింది. ఇంట్రాడేలో ఇవి సరికొత్త గరిష్ట రికార్డ్స్‌ కావడం విశేషం!!

చిన్న షేర్లు దూకుడు
మార్కెట్లను మించుతూ గత వారం మధ్య, చిన్నతరహా కౌంటర్లు దూకుడు చూపాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 4.5 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా దాదాపు 6 శాతం ఎగసింది. 

బ్యాం'కింగ్‌
బ్లూచిప్స్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 20 శాతం, ఎల్‌అండ్‌టీ 13 శాతం, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ 10 శాతం, హీరో మోటో, ఎయిర్‌టెల్‌ 8 శాతం చొప్పున జంప్‌చేశాయి. అయితే టెక్‌ మహీంద్రా, ఐటీసీ, డాకర్ట్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ 6.5-2 శాతం మధ్య క్షీణించాయి.

అదానీ జోరు
మిడ్‌ క్యాప్స్‌లో అదానీ ఎంటర్‌, కేఈఐ, దిలీప్‌ బిల్డ్‌, జేకే సిమెంట్‌, ఐబీ రియల్టీ, బీవోబీ, బీఈఎల్‌, ఐటీఐ, భారత్ ఫైనాన్స్‌, ఎన్‌సీసీ, డెల్టా కార్ప్, గ్రాఫైట్‌, ఇండియా సిమెంట్స్‌ 31-20 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు జూబిలెంట్ లైఫ్‌, ఎరిస్‌ లైఫ్‌, పీఅండ్‌జీ, టొరంట్‌ ఫార్మా, ఆస్ట్రాజెనెకా, థామస్‌ కుక్‌, మ్యాక్స్‌ ఇండియా, కాక్స్‌అండ్‌కింగ్స్‌ 13-5 శాతం మధ్య పతనమయ్యాయి.