సంస్కరణల ఆశలు- భారీ ర్యాలీ

సంస్కరణల ఆశలు- భారీ ర్యాలీ

నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ తిరిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటంతో కీలక సంస్కరణలకు తెరలేవనున్న అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ ర్యాలీ చేశాయి. వెరసి సెన్సెక్స్‌ 623 పాయింట్లు దూసుకెళ్లింది. 39,435 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 187 పాయింట్లు జంప్‌చేసింది. 11,844 వద్ద స్థిరపడింది. కాగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగించవచ్చన్న అంచనాలు గురువారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. కాగా.. బ్రెక్సిట్‌ డీల్‌ అంశంలో విఫలంకావడంతో తాజాగా బ్రిటిష్‌ ప్రధాని థెరెసా మే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బ్యాంక్స్‌- రియల్టీ జూమ్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా..పీఎస్‌యూ బ్యాంక్స్‌ 5.6 శాతం, రియల్టీ 4.5 శాతం, మెటల్‌, ఆటో 3 శాతం చొప్పున జంప్‌చేశాయి. ప్రభుత్వ బ్యాంక్ స్టాక్స్‌లో బీవోఐ, బీవోబీ, యూబీఐ, కెనరా, ఓబీసీ, పీఎన్‌బీ, సిండికేట్‌, ఇండియన్‌, ఎస్‌బీఐ, అలహాబాద్‌, జేఅండ్‌కే 9-3 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌ 12 శాతం పురోగమించగా, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, శోభా, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, మహీంద్రా లైఫ్‌, ప్రెస్టేజ్‌ 6-1.5 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, వేదాంతా, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, జీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, హీరో మోటో 5.3-3.5 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం టెక్‌ మహీంద్రా అదికూడా 1 శాతం నీరసించింది.

చిన్న షేర్లు జోరు
మార్కెట్లు హుషారుగా ముగియడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2-2.5 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1840 లాభపడితే.. 685 మాత్రమే నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్‌
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1352 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 593 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 158 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.