జోష్‌లో ఓమ్‌ మెటల్స్‌- ఆర్‌కేపిటల్‌

జోష్‌లో ఓమ్‌ మెటల్స్‌- ఆర్‌కేపిటల్‌

ప్యాకింగ్‌ విభాగంలో కొంతమేర విక్రయించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ ఓమ్‌ మెటల్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క బీమా రంగ అనుబంధ సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటాను జపనీస్‌ భాగస్వామ్య దిగ్గజం నిప్పన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో రిలయన్స్‌ కేపిటల్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

ఓమ్‌ మెటల్‌ ఇన్‌ఫ్రా
కంపెనీ కార్యకలాపాలకు కీలకంకాని ప్యాకేజింగ్‌ డివిజన్‌లో కొంత భాగాన్ని విక్రయించినట్లు ఓమ్‌ మెటల్స్‌ తాజాగా వెల్లడించింది. మెషీన్‌ విక్రయం ద్వారా దీంతో రూ. 7.6 కోట్లను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఓమ్‌ మెటల్స్ షేరు 2.5 శాతం ఎగసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది.  

Image result for reliance capital ltd

రిలయన్స్ కేపిటల్‌ 
రిలయన్స్ నిప్పన్‌ లైఫ్‌లో తమకున్న వాటాను కొనుగోలు చేసేందుకు నిప్పన్‌ లైఫ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ కేపిటల్‌ పేర్కొంది. ఇందుకు షేరుకి రూ. 230 ధరను నిప్పన్‌ లైఫ్‌ చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఇదే ధరలో సాధారణ వాటాదారులకు సైతం ఓపెన్ ఆఫర్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. గత రెండు నెలల సగటు ధరతో పోలిస్తే ఇది 15 శాతంపైగా అధికమని తెలియజేసింది. రిలయన్స్ నిప్పన్‌లో 25 శాతం వాటా విక్రయం ద్వారా కంపెనీ నుంచి రిలయన్స్ కేపిటల్‌ పూర్తిగా బయటపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రిలయన్స్ కేపిటల్ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 140 వరకూ ఎగసింది. గురువారం సైతం ఈ షేరు 4 శాతం ఎగసి రూ. 132 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.