ఈరోస్‌ జోరు- జెట్‌ ఎయిర్‌ నేలచూపు

ఈరోస్‌ జోరు- జెట్‌ ఎయిర్‌ నేలచూపు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోవైపు కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి హిందుజా, ఎతిహాద్‌ మధ్య డీల్‌ చర్చలు విఫలమయ్యాయన్న వార్తలు ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమయ్యాయి. వివరాలు చూద్దాం..
 
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 70 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 6 శాతం క్షీణించి రూ. 225 కోట్లను తాకింది. ఇబిటా 31 శాతం నీరసించి రూ. 62 కోట్లకు పరిమితమైంది. ఇతర ఆదాయం రెట్టింపునకు పెరిగి రూ. 38 కోట్లను అధిగమించింది. మార్జిన్లు 37.9 శాతం నుంచి 27.6 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఈరోస్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 76 వరకూ పెరిగింది.  

Image result for Jet airways ltd

జెట్‌ ఎయిర్‌వేస్‌
ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కార్యకలాపాలు సైతం నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి హిందుజా గ్రూప్‌, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ మధ్య అంగీకారం కుదరలేదని మీడియా పేర్కొంది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో భాగస్వామి అయిన ఎతిహాద్‌తో హిందుజా గ్రూప్‌ నిర్వహించిన చర్చలు ఫలవంతంకాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 150 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 142 వరకూ జారింది.