స్పైస్‌జెట్‌- అడోర్‌ మల్టీ.. భళా

స్పైస్‌జెట్‌- అడోర్‌ మల్టీ.. భళా

తాజాగా మూడు విమానాల డెలివరీని తీసుకున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోవైపు  ఈకామర్స్ ద్వారా సౌందర్య పోషణ  ప్రీమియం ప్రొడక్టులను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో అడోర్‌ మల్టీప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. అమ్మేవాళ్లు కరవుకావడంతో ఈ కౌంటర్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. తర వివరాలు ఇవీ..
 
స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌
బీవోసీ ఏవియేషన్‌ నుంచి బోయింగ్‌ B737-800 ఎన్‌జీ విమానాలు మూడింటిని డెలివరీ తీసుకున్నట్లు స్పైస్‌జెట్‌ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌ఎం 56 ఇంజిన్లతో కూడిన వీటి ద్వారా సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు మూతపడటంతో విమాన సర్వీసులకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో కొత్త విమానాల ద్వారా స్పైస్‌జెట్‌ లబ్ది పొందనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఎస్ఈలో స్పైస్‌జెట్‌ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 138 వద్ద ట్రేడవుతోంది. స్పైస్‌జెట్‌లో ప్రస్తుతం ప్రమోటర్లకు 60.00% వాటా ఉంది.

Related image

అడోర్‌ మల్టీ ప్రొడక్ట్స్‌
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడోర్‌ మల్టీప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. తద్వారా సౌందర్య పోషణకు చెందిన ప్రీమియం ప్రొడక్టులను విక్రయించనున్నట్లు తెలియజేసింది. అడోర్‌ గ్రూప్‌నకు చెందిన కంపెనీ అమ్మకాలు ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో అడోర్‌ మల్టీ ప్రొడక్ట్స్‌ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ తాకింది. రూ. 42 వద్ద ఫ్రీజయ్యింది.