హై' నుంచి మార్కెట్ల వెనకడుగు

హై' నుంచి మార్కెట్ల వెనకడుగు

లోక్‌సభలో తిరిగి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర చల్లబడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 276 పాయింట్లు ఎగసి 39,386కు చేరగా.. నిఫ్టీ సైతం 95 పాయింట్లు పురోగమించి 11,833 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు క్యూకట్టడంతో దేశీ మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల కీలక మార్క్‌ను దాటిన విషయం విదితమే. వెరసి మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి.

ఎఫ్‌ఎంసీజీ డీలా
ఎన్‌డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫలితాల సరళి వెల్లడించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(1 శాతం), ఐటీ(0.4 శాతం) మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ ఇండెక్స్‌ 3.5 శాతం జంప్‌చేసింది. ప్రభుత్వ బ్యాంక్‌ కౌంటర్లలో బీవోబీ, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌, పీఎన్‌బీ 7-2 శాతం మధ్య ఎగశాయి.

బ్లూచిప్స్‌ తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌ 8 శాతం దూసుకెళ్లగా.. జీ, ఇండస్‌ఇండ్‌, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, గ్రాసిమ్‌, హీరో మోటో, ఐసీఐసీఐ 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఐటీసీ, వేదాంతా, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందాల్కో, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 3-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

చిన్న షేర్లు కళకళ
కేంద్రంలో బీజేపీ తిరిగి పాగావేయనున్న ఫలితాలతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.7-0.4 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1242 లాభపడితే.. 1095 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.