ఆర్‌కేపిటల్‌, అశోకా బిల్డ్‌- హుషార్‌

ఆర్‌కేపిటల్‌, అశోకా బిల్డ్‌- హుషార్‌

బీమా రంగ అనుబంధ సంస్థ రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటాను జపనీస్‌ భాగస్వామ్య దిగ్గజం నిప్పన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో రిలయన్స్‌ కేపిటల్‌ కౌంటర్‌ జోరందుకుంది. దీంతో అనిల్‌ అంబానీ గ్రూప్‌ ఫైనాన్షియనల్‌ రంగ సంస్థ రిలయన్స్ కేపిటల్‌ షేరు లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో మౌలిక సదుపాయాల సంస్థ అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం...

రిలయన్స్ కేపిటల్‌ 
రిలయన్స్ నిప్పన్‌ లైఫ్‌లో తమకున్న వాటాను కొనుగోలు చేసేందుకు నిప్పన్‌ లైఫ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ కేపిటల్‌ పేర్కొంది. ఇందుకు షేరుకి రూ. 230 ధరను నిప్పన్‌ లైఫ్‌ చెల్లించనున్నట్లు తెలియజేసింది. ఇదే ధరలో సాధారణ వాటాదారులకు సైతం ఓపెన్ ఆఫర్‌ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. గత రెండు నెలల సగటు ధరతో పోలిస్తే ఇది 15 శాతంపైగా అధికమని తెలియజేసింది. రిలయన్స్ నిప్పన్‌లో 25 శాతం వాటా విక్రయం ద్వారా కంపెనీ నుంచి రిలయన్స్ కేపిటల్‌ పూర్తిగా బయటపడనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రిలయన్స్ కేపిటల్ షేరు 4.3 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 139ను సైతం అధిగమించింది.

Related image

అశోకా బిల్డ్‌కాన్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో అశోకా బిల్డ్‌కాన్‌ నికర లాభం 47 శాతం క్షీణించి రూ. 98 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 86 శాతం ఎగసి రూ. 1307 కోట్లను అధిగమించింది. ఇబిటా రెట్టింపునకు పెరిగి 181 కోట్లను తాకింది. మార్జిన్లు 11.5 శాతం నుంచి 13.9 శాతానికి బలపడ్డాయి. పన్ను వ్యయాలు, ఫైనాన్స్‌ వ్యయాలు లాభాలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో అశోకా బిల్డ్‌కాన్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 125 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 127 వరకూ ఎగసింది.