సెన్సెక్స్‌ 40,000- నిఫ్టీ 12,000!!

సెన్సెక్స్‌ 40,000- నిఫ్టీ 12,000!!

లోక్‌సభలో తిరిగి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాయి.  ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు క్యూకట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 12,000 పాయింట్ల కీలక మార్క్‌ను దాటేసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 982 పాయింట్లు దూసుకెళ్లి  40,092 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం లాభాల ట్రిపుల్‌కు చేరువైంది. 294 పాయింట్లు ఎగసి 12,032 వద్ద ట్రేడవుతోంది. 

అన్ని రంగాలూ
ఎన్‌డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫలితాల సరళి వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3.5-1.5 శాతం మధ్య పెరిగాయి. బ్యాంక్‌ నిఫ్టీ, మీడియా, రియల్టీ, ఆటో రంగాలూ జోరు చూపుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌ 10 శాతం దూసుకెళ్లగా.. యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ, జీ, అల్ట్రాటెక్ 8.5-4.6 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో వేదాంతా, విప్రో, హిందాల్కో, టీసీఎస్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 0.5 శాతం చొప్పున నష్టపోయాయి.

అదానీ గ్రూప్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీవోబీ, అదానీ పవర్‌, ఇండియా సిమెంట్స్‌, కెనరా బ్యాంక్‌, రిలయన్స్ కేపిటల్‌, డీష్‌ టీవీ 10-4.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క కమిన్స్, పేజ్‌, యూబీఎల్‌ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు కళకళ
కేంద్రంలో బీజేపీ తిరిగి పాగావేయనున్న ఫలితాలతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 2-1.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1488 లాభపడితే.. 524 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.