ఖుషీ ఖుషీగా- ఇండస్‌ఇండ్, సన్‌ టీవీ

ఖుషీ ఖుషీగా- ఇండస్‌ఇండ్, సన్‌ టీవీ

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలలో సగభాగాన్ని మొండిబకాయిల(ఎన్‌పీఏలు)గా గుర్తించి కేటాయింపులు చేపట్టినట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు జోరందుకుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో తమిళనాడులో డీఎంకే పార్టీ ఆధిక్యం చూపుతున్న కారణంగా సన్‌ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం...

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌
ఆర్థిక సమస్యలతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు అందించిన రుణాలలో 55 శాతం వరకూ మొండిబకాయిలకింద కేటాయింపులు చేపట్టినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇండస్‌ఇండ్‌ రూ. 3,000 కోట్ల రుణాలిచ్చింది. కాగా.. ప్రస్తుతం ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 1616 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1640 వరకూ ఎగసింది. బుధవారం సైతం ఈ షేరు 6 శాతం స్థాయిలో ఎగసిన విషయం విదితమే. 

Related image

సన్‌ టీవీ నెట్‌వర్క్‌
తమిళనాడులో డీఎంకే పార్టీ స్పష్టమైన ఆధిక్యం చూపుతున్న నేపథ్యంలో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం జంప్‌చేసి రూ. 584 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 597 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! సన్‌ టీవీ ప్రమోటర్‌ కళానిధి మారన్‌ డీఎంకే పార్టీ దివంగత నాయకుడు కరుణానిధికి మేనల్లుడుకాగా.. సన్‌ టీవీ షేరు వరుసగా రెండో రోజు జోరు చూపుతోంది.