ఫలితాల ఎఫెక్ట్‌- సెన్సెక్స్‌ జూమ్‌

ఫలితాల ఎఫెక్ట్‌- సెన్సెక్స్‌ జూమ్‌

సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫలితంగా మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సృష్టించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 768 పాయింట్లు దూసుకెళ్లి  39,878 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 227 పాయింట్లు ఎగసి 11,965 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 12,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. సరికొత్త గరిష్టాలివి!

అన్ని రంగాలూ
ఎన్‌డీఏ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫలితాల సరళి వెల్లడించడంతో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3.5-1.5 శాతం మధ్య పెరిగాయి. బ్యాంక్‌ నిఫ్టీ, మీడియా, రియల్టీ, ఆటో రంగాలూ జోరు చూపుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, ఐబీ హౌసింగ్‌, జీ, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్ఐఎల్‌ 6.2-2.6 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఒక్క షేరూ ప్రస్తావించదగ్గ స్థాయిలో నష్టపోకపోవడం విశేషం!!

అదానీ గ్రూప్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండియా సిమెంట్స్‌, భారత్ ఫైనాన్స్‌, అదానీ పవర్, బీవోబీ, ఆర్‌పవర్, సన్‌ టీవీ, దివాన్‌ హౌసింగ్‌ 8-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. టొరంట్ ఫార్మా, యూబీఎల్‌ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు కళకళ
కేంద్రంలో బీజేపీ తిరిగి పాగావేయనున్న ఫలితాలతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1148 లాభపడితే.. 178 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎన్‌ఏసీఎల్‌, టీఐఎల్‌, 5పైసా, టీడీ పవర్‌, టిమ్‌కెన్, సట్లెజ్‌, స్కిప్పర్‌, భారత్‌ ఫైనాన్స్, రామ్‌కో సిస్టమ్స్‌, అదానీ గ్యాస్‌, సన్‌టెక్‌, శ్రేయాస్‌, మంగళం సిమెంట్‌, ఏషియన్‌ ఆయిల్‌, ఇండియా సిమెంట్స్‌, ఐబీ వెంచర్స్‌ 17-5 శాతం మధ్య జంప్‌చేశాయి.