ఫ్లాట్‌ ఓపెనింగ్‌- హై వొలాటిలిటీ?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌- హై వొలాటిలిటీ?!

నేడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పష్టతరానున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,770 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే మార్కెట్‌ ప్రారంభమయ్యాక ఫలితాలపై నెమ్మదిగా స్పష్టతరానున్న కారణంగా నేడు అధికస్థాయిలో ఊగిసలాటకు లోనయ్యే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. తాజాగా మరో చైనీస్‌ కంపెనీ హిక్‌విజన్‌పై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించనున్న వార్తలతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ఇప్పటికే చైనీస్‌ టెలికం దిగ్గజం హువేపై విధించిన ఆంక్షలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా సడలించిన సంగతి తెలిసిందే.
 
లాభాలతోనే ముగింపు
లోక్‌సభలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఒక్కరోజులో స్పష్టత రానున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు ఆటుపోట్లకు లోనయ్యాయి. బుధవారం ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,249- 38,904 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. చివరికి 140 పాయింట్లు బలపడి 39,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 11,785- 11,682 పాయింట్ల మధ్య ఒడిదొడుకులకు లోనైంది. చివరికి 29 పాయింట్లు బలపడి 11,738 వద్ద ముగిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొనడంతో ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకున్న విషయం విదితమే. దీంతో ట్రేడర్లు దఫాలవారీగా లాభాల స్వీకరణకు దిగుతుండటంతో మార్కెట్లు కన్సాలిడేట్‌ అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,685 పాయింట్ల వద్ద, తదుపరి 11,633 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,788 పాయింట్ల వద్ద, తదుపరి 11,837 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,305, 30,084 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,712, 30,897 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమ్మకాలే..
గత రెండు రోజులుగా నగదు విభాగంలో రూ. 2919 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం మాత్రం రూ. 965 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా.. సోమ, మంగళవారాల్లో రూ. 1633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం సైతం రూ. 158 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.