కరూర్‌ వైశ్యా డౌన్‌- జూబిలెంట్‌ జోరు

కరూర్‌ వైశ్యా డౌన్‌- జూబిలెంట్‌ జోరు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ లిమిడెట్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఫాస్ట్‌ ఫుడ్‌ స్టోర్ల సంస్థ జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..


కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ నికర లాభం 19 శాతం పెరిగి రూ. 60 కోట్లను తాకింది. అయితే నికర వడ్డీ ఆదాయం 4 శాతం క్షీణించి రూ. 619 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.49 శాతం నుంచి 8.79 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 4.99 శాతం నుంచి 4.98 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 440 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 76 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 75 దిగువకు చేరింది.

Related image

జూబిలెంట్‌ ఫుడ్‌ 
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జూబిలెంట్‌ ఫుడ్‌ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 74 కోట్లను తాకింది. ఇబిటా 15 శాతం బలపడి రూ. 147 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 865 కోట్లకు చేరింది. మార్జిన్లు 16.4 శాతం నుంచి 17 శాతానికి బలపడ్డాయి. శ్రీలంకలో స్టోర్ల మూసివేత కారణంగా రూ. 8 కోట్లమేర అనుకోని నష్టాలు నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ షేరు 3.5 శాతం జంప్‌చేసి రూ. 1243 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1254 వరకూ దూసుకెళ్లింది.Most Popular