కొత్త ఆశలు- ప్రపంచ మార్కెట్ల రికవరీ

కొత్త ఆశలు- ప్రపంచ మార్కెట్ల రికవరీ

వాణిజ్య వివాదాలకు చైనాతో పరిష్కారం కుదరనప్పటికీ నిర్మాణాత్మక చర్చలకు అవకాశమున్నట్లు ప్రెసిడెంట్ ట్రంప్‌ తాజాగా వ్యాఖ్యానించడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. డోజోన్స్‌ 345 పాయింట్లు(1.4 శాతం) పెరిగి 25,670కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 39 పాయింట్ల(1.4 శాతం) పుంజుకుని 2,851 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 124 పాయింట్లు(1.6 శాతం) జంప్‌చేసి 7,771 వద్ద స్థిరపడింది. రెండు దేశాలూ పరస్పర అవగాహనతో చర్చలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు చైనా విదేశాంగ శాఖ సైతం పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

వివాద ఎఫెక్ట్‌
గత వారాంతాన 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం 25 శాతానికి సుంకాలను పెంచివేయగా.. ఇందుకు ప్రతిగా 60 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ దిగుమతులపై టారిఫ్‌లను పెంచనున్నట్లు చైనా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ముదరనున్న ఆందోళనలు వ్యాపించాయి. వెరసి సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 2-4 శాతం మధ్య పతనమైన విషయం విదితమే. 

బోయింగ్‌ అప్‌
చైనాతో వాణిజ్యం అధికంగా కలిగిన వైమానిక దిగ్గజం బోయింగ్‌ 2 శాతం లాభపడగా.. ఫలితాలు నిరాశపరచడంతో రాల్ఫ్‌ లారెన్‌ కార్ప్‌ 4 శాతం పతనమైంది. ఇటీవలే స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయి పతనబాటలో సాగిన ఉబర్‌ టెక్నాలజీస్‌, లిఫ్ట్‌ ఇంక్‌ కౌంటర్లలో షార్ట్‌ కవరింగ్‌ కనిపించింది. ఉబర్‌ టెక్‌ 1.7 శాతం బలపడగా.. లిఫ్ట్‌ ఇంక్ 5.5 శాతం జంప్‌చేసింది. కామ్‌క్యాస్ట్‌కు చెందిన హులును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో వాల్ట్‌డిస్నీ షేరు 2 శాతం లాభపడగా.. కామ్‌క్యాస్ట్‌ సైతం 2.4 శాతం ఎగసింది.

లాభాలతో..
అమెరికా, చైనా తిరిగి వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారంభించనున్న అంచనాలతో మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 1.5-1 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. చైనా, తైవాన్‌, హాంకాంగ్, కొరియా 1-0.6 శాతం మధ్య జంప్‌చేయగా.. ఇండొనేసియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ నామమాత్ర లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ స్వల్ప నష్టంతో కదులుతోంది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్‌ 97.53ను తాకగా.. జపనీస్‌ యెన్‌ 109.67కు బలపడింది. యూరో 1.12 వద్ద స్థిరంగా కదులుతోంది.Most Popular