ఫ్లాట్‌ ఓపెనింగ్‌ చాన్స్‌?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ చాన్స్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 11 పాయింట్లు తక్కువగా 11,250 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. వాణిజ్య వివాద పరిష్కారాలు కుదరనప్పటికీ నిర్మాణాత్మక చర్చలకు వీలున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించడంతో కొంతమేర సెంటిమెంటు బలపడింది. దీంతో మంగళవారం అమెరికా, యూరొపియన్‌ స్టాక్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే మంగళవారం దేశీ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ కావడంతో నేడు మరోసారి ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
9 రోజుల నష్టాలకు చెక్‌
ఎట్టకేలకు తొమ్మిది రోజుల వరుస నష్టాలకు మంగళవారం చెక్‌ పడింది. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కనిష్టాలకు చేరిన కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి తొలుత ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు జంప్‌చేసి 37,319కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు పుంజుకుని 11,222 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 37873-36,956 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,122 పాయింట్ల వద్ద, తదుపరి 11,022 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,308 పాయింట్ల వద్ద, తదుపరి 11,395 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 28,588, 28,348 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,064, 29,299 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో సోమవారం రూ. 1056 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 2012 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే సోమవారం రూ. 1058 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం మరోసారి రూ. 2243 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular