9 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల దశమి

9 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల దశమి

ఎట్టకేలకు స్టాక్‌ ఇన్వెస్టర్ల మోమున చిరునవ్వు విరిసింది. వరుసగా తొమ్మిది రోజులపాటు నష్టాల బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, కనిష్టాలకు చేరిన కౌంటర్లలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్ మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి తొలుత ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 228 పాయింట్లు జంప్‌చేసి 37,319కు చేరగా.. నిఫ్టీ 74 పాయింట్లు పుంజుకుని 11,222 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 37873-36,956 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కాగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న పరిస్థితులతో సోమవారం అమెరికా మార్కెట్లు 2-3 శాతం మధ్య పతనమయ్యాయి.

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ దాదాపు 3 శాతం జంప్‌చేయగా.. ఫార్మా, రియల్టీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.6 శాతం మధ్య ఎగశాయి. ఐటీ మాత్రమే(1.2%) క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, వేదాంతా, గెయిల్‌, ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, టాటా మోటార్స్‌ 6.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం 3-0.5 శాతం మధ్య క్షీణించాయి. 

ఎఫ్‌అండ్‌వో జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐఆర్‌బీ, మణప్పురం, బీహెచ్‌ఈఎల్‌, రిలయన్స్‌ పవర్, వొకార్డ్‌, అదానీ పవర్‌, ఐడీబీఐ, రిలయన్స్ ఇన్‌ఫ్రా 8-6 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా మరోపక్క.. జెట్‌ ఎయిర్‌వేస్‌, పీసీ జ్యువెలర్స్‌, సెయిల్‌, కర్ణాటక బ్యాంక్‌, బాటా, ఐడియా, జూబిలెంట్‌ ఫుడ్‌, కేడిలా 7.4-3 శాతం మధ్య పతనమయ్యాయి.  

మిడ్‌ క్యాప్స్‌ అప్‌
మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ జోరందుకున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1224 లాభపడగా.. 1282 నష్టాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాల బాట 
నగదు విభాగంలో గత ఆరు రోజులుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం రూ. 1056 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే  ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1058 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గత 6 సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 4600 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2935 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.Most Popular