దివాన్‌ హౌసింగ్‌- డెల్టా కార్ప్‌-లాభాల కిక్‌

దివాన్‌ హౌసింగ్‌- డెల్టా కార్ప్‌-లాభాల కిక్‌

కంపెనీ రేటింగ్‌ను క్రిసిల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ కౌంటర్‌ జోరందుకుంది. మరోవైపు గత ఆరురోజులుగా నేలచూపులకే పరిమితమై కదులుతున్న కాసినోలు, గేమింగుల సంస్థ డెల్టా కార్ప్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

దివాన్‌ హౌసింగ్‌ కార్ప్‌
దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కమర్షియల్‌ పేపర్‌ రేటింగ్‌ను A3+ నుంచి A4+కు క్రిసిల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అంచనాలకు మించి లిక్విడిటీ పరిస్థితి క్షీణిస్తున్న కారణంగా ప్రతికూల పరిస్థితులతో కూడిన రేటింగ్‌ వాచ్‌ను రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ ప్రకటించింది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 106ను తాకింది. తదుపరి జోరందుకుని నష్టాలను పూడ్చుకోవడంతోపాటు.. లాభాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 119 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌సెషన్‌ వరకూ ఈ కౌంటర్లో 17 మిలియన్‌ షేర్లు ట్రేడ్‌కావడం గమనార్హం! ఇటీవల నష్టాల బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల రోజుల్లో దివాన్‌ హౌసింగ్‌ షేరు 33 శాతం పతనమైన విషయం విదితమే. 2019లో ఇప్పటివరకూ 55 శాతం తిరోగమించింది.

డెల్టా కార్ప్‌ లిమిటెడ్
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) చెల్లింపులపై వెలువడ్డ ఆరోపణల నేపథ్యంలో వరుసగా ఏడు రోజులపాటు క్షీణపథంలో పయనించిన డెల్టా కార్ప్‌ కౌంటర్‌ ఉన్నట్టుంది ఊపందుకుంది. అయితే ఎన్‌ఎస్ఈలో తొలుత నామమాత్ర వెనకడుగుతో రూ. 184 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాల పరుగందుకుంది. ప్రస్తుతం దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 202 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 211 వరకూ ఎగసింది. ట్రేడింగ్‌ పరిమాణం సైతం గత 20 రోజుల చలన సగటుతో పోలిస్తే 12 రెట్లు ఎగసింది.
నేలచూపులతో..
కృత్రిమంగా సర్వీసులను విడదీయడం ద్వారా జీఎస్‌టీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వెలువడ్డ ఆరోపణల నేపథ్యంలో కాసినో గేమింగ్ బిజినెస్‌ల సంస్థ డెల్టా కార్ప్ షేరు సోమవారం సైతం 13 శాతం కుప్పకూలింది. రూ. 186 వద్ద ముగిసింది. 2017 సెప్టెంబర్‌ తదుపరి ఇది కనిష్టంకాగా.. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఈ కౌంటర్ 19 శాతం డీలాపడింది. అయితే జీఎస్‌టీ చట్టాలకు అనుగుణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డెల్టా కార్ప్‌ సీఎఫ్‌వో పేర్కొనడం గమనార్హం!  ఇటీవల నష్టాల బాటలో సాగుతున్న ఈ కౌంటర్లో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడం సానుకూల ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.Most Popular