కనిష్టం నుంచి కోలుకున్న రుపీ

కనిష్టం నుంచి కోలుకున్న రుపీ

దేశీ కరెన్సీ రెండు నెలల కనిష్టం నుంచి కోలుకుంది. మంగళవారంనాటి భారీ నష్టాల నుంచి బయటపడిన రూపాయి 7 పైసలు బలపడి 70.44 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరికొంత రికవరీ సాధించింది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 18 పైసలు (0.3 శాతం) పుంజుకుని 70.33 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం మార్కెట్ల పతనంతోపాటు.. రూపాయి సైతం అమ్మకాలతో కుదేలైంది. శుక్రవారం ముగింపు 69.92తో పోలిస్తే 70.16 వద్ద ప్రారంభమై 70.53 వరకూ పతనమైంది. చివరికి 59 పైసలు కోల్పోయి 70.51 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ముడిచమురు ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు చెలరేగుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.  

ఎఫ్‌పీఐల యూటర్న్‌
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మే నెలలో దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెలలో నగదు విభాగంలో గత 8 సెషన్లలో రూ. 6,000 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు రూ. 16,093 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ గత రెండు వారాలుగా క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుండటం గమనించదగ్గ అంశం. ఇందుకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారంకాకపోగా.. తాజాగా రెండు దేశాలూ దిగుమతులపై టారిఫ్‌ల విధింపును ప్రకటించడం వంటి అంశాలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.Most Popular