కన్సాలిడేషన్‌లో.. ఐటీ కుదేల్‌

కన్సాలిడేషన్‌లో.. ఐటీ కుదేల్‌

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 90 పాయింట్లు నీరసించి 37,000కు చేరగా.. నిఫ్టీ 25 పాయింట్ల వెనకడుగుతో 11,123 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై వాషింగ్టన్‌ ప్రభుత్వం టారిఫ్‌లను పెంచగా.. 60 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ దిగుమతులపైనా సుంకాల విధింపునకు చైనీస్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలకే కట్టుబడటంతో దేశీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. 

ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ 1.7 శాతం క్షీణించగా.. ఆటో, రియల్టీ 0.5 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా రంగాలు 1.5-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ బ్యాంక్‌ 3-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే సన్‌ ఫార్మా, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, గెయిల్‌, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఆర్‌ఐఎల్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి.  

జెట్‌ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 9 శాతం కుప్పకూలగా, కర్ణాటక బ్యాంక్‌, ఐడియా, సెయిల్‌, డిష్‌ టీవీ, అపోలో టైర్‌, పీసీ జ్యువెలర్స్‌, బాటా, ఐసీఐసీఐ ప్రు 6-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా మరోపక్క.. మణప్పురం, బీహెచ్‌ఈఎల్‌, అదానీ పవర్, ఐడీఎఫ్‌సీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐడీబీఐ, దివాన్‌, సీజీ పవర్, ఐఆర్‌బీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా 6-3.6 శాతం మధ్య జంప్‌చేశాయి. 

స్మాల్‌ క్యాప్స్‌ డీలా
మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న నేపథ్యంలో చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1355 నష్టపోగా.. 823 మాత్రమే లాభాతో కదులుతున్నాయి. 



Most Popular