జెట్‌ ఎయిర్‌కు షాక్‌- టాటా స్టీల్‌ వీక్‌

జెట్‌ ఎయిర్‌కు షాక్‌- టాటా స్టీల్‌ వీక్‌

ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కార్యకలాపాలు నిలిచిపోయిన విమానయాన రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు తాజాగా మరో షాక్‌ తగిలింది. కంపెనీ సీఎఫ్‌వో, సీఈవో అమిత్‌ అగర్వాల్‌ ఉన్నపళాన రాజీనామా చేసినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోవైపు విదేశీ దిగ్గజం థిస్సెన్‌క్రుప్‌తో భాగస్వామ్య సంస్థ ఏర్పాటుపై సందేహాలు పెరగడంతో టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా స్టీల్‌ కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. వివరాలు చూద్దాం...

జెట్‌ ఎయిర్‌వేస్‌
వ్యక్తిగత కారణాలతో కంపెనీ సీఎఫ్‌వో, సీఈవో అమిత్‌ అగర్వాల్‌ పదవికి రాజీనామా చేసినట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా వెల్లడించింది. 2015లో సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌ 2016-17 మధ్య కాలంలో సీఈవోగానూ వ్యవహరించారు. కంపెనీ మొత్తం రూ. 10,000 కోట్ల రుణభారంతో కుదేలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 9.5 శాతం కుప్పకూలి రూ. 126 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ మాత్రమే రేసులో నిలిచిన కారణంగా సోమవారం సైతం ఈ షేరు 7 శాతంపైగా పతనమై రూ. 139 వద్ద ముగిసింది.

Image result for tata steel ltd

టాటా స్టీల్‌
థిస్సన్‌క్రుప్‌తో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు యూరోపియన్‌ కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేయవచ్చన్న అంచనాల కారణంగా టాటా స్టీల్‌ కౌంటర్‌ మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2 శాతం క్షీణించి రూ. 464 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 460 వరకూ నష్టపోయింది. వెరసి 52 వారాల కనిష్టానికి చేరువైంది. ఈ నెల 10న యూరోపియన్‌ కమిషన్‌ రెండు సంస్థలతోనూ చర్చించాక జేవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే వీలులేనట్లు సంకేతాలిచ్చిందని టాటా స్టీల్‌ ఇప్పటికే తెలియజేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మే నెలలో ఇప్పటివరకూ  టాటా స్టీల్‌ షేరు 17 శాతం తిరోగమించింది. Most Popular