టారిఫ్‌లకు చైనా సై- వాల్‌స్ట్రీట్‌ బేర్‌

టారిఫ్‌లకు చైనా సై- వాల్‌స్ట్రీట్‌ బేర్‌

అమెరికా దిగుమతి సుంకాల విధింపునకు చైనా బదులిచ్చింది. 60 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ దిగుమతులపై టారిఫ్‌లను పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య వివాదాలు ముదరనున్న ఆందోళనలు వ్యాపించాయి. వెరసి సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 2-4 శాతం మధ్య పతనమయ్యాయి. గత వారాంతాన వాణిజ్య వివాద పరిష్కారానికి డీల్‌ కుదుర్చుకోకుండానే అమెరికా, చైనా మధ్య జరిగిన రెండు రోజుల చర్చలు ముగిశాయి. అయితే చర్చలు కొనసాగుతున్నప్పటికీ అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై టారిఫ్‌లను 25 శాతానికి పెంచివేసిన సంగతి తెలిసిందే.

Image result for boeing inc and caterpillar inc

నేలచూపుతో
సోమవారం డోజోన్స్‌ 617 పాయింట్లు(2.4 శాతం) పతనమై 25,325కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 70 పాయింట్ల(2.4 శాతం) తిరోగమించి 2,881 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 270 పాయింట్లు(3.4 శాతం) పడిపోయి 7,647 వద్ద స్థిరపడింది. వెరసి డోజోన్స్‌ మూడు నెలల కనిష్టానికి చేరగా.. నాస్‌డాక్‌ 2019లోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది.

Related image

యాపిల్‌, బోయింగ్‌ బోర్లా
చైనాతో వాణిజ్యం అధికంగా కలిగిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు 6 శాతం కుప్పకూలగా.. డీరె అండ్‌ కంపెనీ, బోయింగ్‌ ఇంక్‌, కేటర్‌పిల్లర్‌, జనరల్‌ మోటార్స్‌ 6.2-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. సోమవారం లిస్టయిన ఉబర్‌ టెక్నాలజీస్‌ 11 శాతం పడిపోయింది. లిస్టింగ్‌ తొలి రోజు సైతం ఈ షేరు 5 శాతంపైగా నీరసించిన విషయం విదితమే. మరోవైపు ఔషధ ధరల నిర్ణయంపై లాసూట్‌ ఆందోళనలతో జనరిక్‌ ఔషధ సంస్థలు తేవా 15 శాతం, మైలాన్‌ 9.4 శాతం చొప్పున దిగజారాయి. చిప్‌ తయారీ సంస్థలు మైక్రాన్‌ టెక్నాలజీ, ఇంటెల్‌ కార్ప్‌ సైతం 3 శాతం స్థాయిలో క్షీణించాయి.

కొరియా మినహా..
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న పరిస్థితుల నేపథ్యంలో సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు నష్టపోయాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 1.55-0.55 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో కొరియా మాత్రమే నష్టాలకు ఎదురీదుతోంది. 0.6 శాతం ఎగసింది. మిగిలిన మార్కెట్లలో హాంకాంగ్, ఇండొనేసియా, సింగపూర్‌, జపాన్‌, తైవాన్‌, చైనా 1.6-0.5 శాతం మధ్య క్షీణించాయి.  థాయ్‌లాండ్‌ 0.15 శాతం నష్టంతో ట్రేడవుతోంది. Most Popular