రుపీ కుదేల్‌- ఎఫ్‌పీఐల ఎఫెక్ట్‌?

రుపీ కుదేల్‌- ఎఫ్‌పీఐల ఎఫెక్ట్‌?

రూపాయి మళ్లీ పతనబాట పట్టింది. వారాంతాన నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ నామమాత్రంగా 2 పైసలు బలపడిన దేశీ కరెన్సీ తిరిగి డీలాపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 22 పైసలు(0.2 శాతం) బలహీనపడి 70.14 వద్ద ప్రారంభమైంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 70 దిగువకు చేరింది. ప్రస్తుతం మరింత వెనకడుగు వేసింది. డాలరుతో మారకంలో 32 పైసలు కోల్పోయి 70.23 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం స్వల్పంగా 2 పైసలు పుంజుకున్న రూపాయి 69.92 వద్ద ముగిసింది.

నాలుగో రోజూ బేజార్‌
డాలరుతో మారకంలో గత వారం తొలి నాలుగు రోజులూ దేశీ కరెన్సీ నేలచూపులకే పరిమితమైంది. సోమవారం(6న) 18 పైసలు కోల్పోయిన రూపాయి 69.40 వద్ద ముగిసింది. తిరిగి మంగళవారం నామమాత్రంగా 3 పైసలు బలహీనపడి 69.43 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బుధవారం సైతం 28 పైసలు నీరసించి 69.71 వద్ద ముగిసింది. ఇక గురువారం మరో 23 పైసలు నష్టపోయి 69.94 వద్ద నిలిచింది. వెరసి గత వారం నికరంగా 70 పైసలు కోల్పోయింది. ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో నీరసించడంతోపాటు.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఫీఐలు) దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ రావడం సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ఎలాంటి డీల్‌ కుదుర్చుకోకుండానే ముగియడంతో డాలరు బలపడగా.. ఇతర ప్రధాన కరెన్సీలు డీలాపడ్డాయి. 

ఎఫ్‌పీఐల యూటర్న్‌
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో నికర పెట్టుబడిదారులుగా నిలుస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు ఈ నెలలో దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో మే 2-10 మధ్య ఏడు సెషన్లలో ఎఫ్‌పీఐలు దేశీ కేపిటల్‌ మార్కెట్ల(ఈక్విటీ, డెట్‌) నుంచి నికరంగా రూ. 3207 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా.. ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు రూ. 16,093 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేయడం ప్రస్తావించదగ్గ అంశం! Most Popular