మార్కెట్ చూపు ఈ 3 అంశాలపైనే

మార్కెట్ చూపు ఈ 3 అంశాలపైనే

దేశీ స్టాక్‌ మార్కెట్లను ఇకపై ప్రధానంగా మూడు అంశాలు లీడ్‌ చేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటిలో తొలిగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలను ప్రస్తావిస్తున్నారు. గత రెండు రోజులుగా చైనీస్‌ వైస్‌ప్రీమియర్ లియూ వాణిజ్య వివాద పరిష్కారానికి వాషింగ్టన్‌లో చర్చలు నిర్వహించినప్పటికీ ఎలాంటి డీల్‌ కుదరలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వారాంతం నుంచీ అమల్లోకి వచ్చే విధంగా చైనీస్‌ దిగుమతులపై టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై చైనా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. కాగా.. చైనాతో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినట్లు ఓవైపు ట్రంప్‌, మరోవైపు ఆర్థిక కార్యదర్శి ముచిన్‌ పేర్కొనడం గమనార్హం! ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే విషయం విదితమే.

క్యూ4 ఫలితాలు
ఇప్పటికే కార్పొరేట్ ఫలితాల సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ వారం మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు గతేడాది(2018-19) చివరి త్రైమాసిక పనితీరును వెల్లడించనున్నాయి. డీమార్ట్‌ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ 11న, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ, మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, వొడాఫోన్‌ ఐడియా, జస్ట్‌ డయల్‌ 13న క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో నెస్లే ఇండియా 14న, లుపిన్‌ 15న, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందాల్కో 16న పనితీరు వెల్లడించనున్నాయి. ఇదేవిధంగా బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్స్‌, ఐవోసీ, యూపీఎల్‌ 17న ఫలితాలు విడుదల చేయనున్నాయి.

Related image

గణాంకాలు, పోలింగ్‌
ఏప్రిల్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 13న, టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 2.86 శాతాన్ని తాకగా.. డబ్ల్యూపీఐ 3.2 శాతానికి చేరింది. కాగా.. సార్వత్రిక ఎన్నికల చివరి రెండు దశల పోలింగ్‌ ఈ నెల 12, 19న జరగనుంది. దీంతో ఏడు దశల పోలింగ్‌ పూర్తికానుంది. తదుపరి కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అంచనాలు ఊపందుకునే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వీటికీ ప్రాధాన్యం
అమెరికా, చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ సేల్స్ గణాంకాలతోపాటు.. జపాన్‌ కరెంట్‌ ఖాతా వివరాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. ఇవికాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.