మోడీ జీడీపీపై నమ్మకం అంతంతే ! విదేశీ పెట్టుబడులకు బ్యాడ్ టైం

మోడీ జీడీపీపై నమ్మకం అంతంతే ! విదేశీ పెట్టుబడులకు బ్యాడ్ టైం

జీడీపీ... (స్థూల జాతియోత్పత్తి) మన దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో చెప్పే ప్రధానమైన గణాంకం. దీన్ని చూసే వివిధ దేశాలు, ఆర్థిక సంస్థలు మనకు అప్పులిస్తాయి, పెట్టుబడులు కుమ్మరిస్తాయి, మన పరపతిని లెక్కగడ్తాయి. ఏ దేశ గమనానికైనా ఇదే అసలు సిసలైన దిక్సూచీ. అంతటి ప్రాధాన్యత ఉన్న జీడీపీ డేటా అంతా తప్పులతడకని, ఇది పూర్తిగా వండి వడ్డించిన డేటా అని  సాక్షాత్తూ నేషనల్ శాంపుల్ సర్వే వంటి కేంద్ర సంస్థే తప్పుబట్టింది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు మంటలో గలిసింది. తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కూడా దీనిపై నోరుమెదిపారు. ఎన్నికల తర్వాత ఓ కమిటీ నేతృత్వంలో ఈ గణాంకాలను నిగ్గుతేల్చే ప్రాతిపదికను ఖరారు చేయాలని సూచించారు. ఆయనే కాదు వివిధ రీసెర్చ్ సంస్థలు కూడా మోడీ స్టైల్ మార్క్‌పై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

మాయా చిత్రం
ఓ దేశ వృద్ధి రేటును దేశ ఆర్ధిక వ్యవస్థ, సగటు మనిషి ఆదాయం , వ్యయాలు, ప్రభుత్వ రాబడి వంటి అంశాలతో గుణిస్తారు. ఏ దేశానికైనా ఇది ఆయువు పట్టు. ఎందుకంటే.. సదరు దేశం ఎలాంటి అభివృద్ధిని సాధిస్తోంది, సదరు దేశానికి అప్పు తీసుకుని తిరిగి తీర్చగల సామర్ధ్యం ఉందా లేదా.. ఆ దేశ కరెన్సీకి ఎంత విలువ ఉంది అనే వివరాలను పరిగణిస్తారు. ప్రతీ దేశానికీ ఇది అత్యంత ముఖ్యం. కానీ మన దేశంలో మాత్రం ఇది ఓ ఫార్స్‌లా మారినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జీడీపీ సిరీస్‌ను ప్రకటించడం మొదలుపెట్టింది. 2011-12ను బేస్ ఇయర్‌గా తీసుకుని జీడీపీని లెక్కించారు. ఇది ఒక రకంగా సరైన నిర్ణయమే అయినా  సదరు జీడీపీని లెక్కించడానికి తీసుకునే డేటా మాత్రం తప్పుల తడకని అర్థమవుతోంది. 

ఎంసిఏ 21
ఎంసిఏ 21.. ఇదేదో మిగ్ 21 యుద్ధవిమానంలా అనిపించవచ్చు. కానీ ఇది కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సంబంధించిన అంశం. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ 21 అనే డేటా బేస్. వీళ్ల డేటాబేస్‌ను ఆధారంగా తీసుకుని గ్రాస్ వేల్యూ యాడెడ్ (జివిఏ)ను లెక్కిస్తూ వచ్చారు. దేశంలో వస్తువులు, సేవల ఉత్పత్తి ఎంతో నిగ్గుతేలుస్తూ వచ్చారు. కానీ.. ఎంసిఏ రూపొందిస్తున్న డేటా తప్పులతడకగా ఉందని సాక్షాత్తూ మరో కేంద్ర సంస్థ ఎన్ఎస్ఎస్ఓని తేల్చింది. వీళ్ల ప్రకారం ఎంసిఏ 21లో ఉన్న 38 శాతం కంపెనీలపై అనుమానాలను వ్యక్తం చేసింది. 16.4 శాతం కంపెనీల అడ్రస్‌లే అసలు ఎక్కడా లేవు. మరో 21.4 శాతం కంపెనీలు ఔట్ ఆఫ్ కవరేజ్‌లో ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని తయారు చేసిన జీడీపీ డేటా ఎలా కరెక్ట్ అవుతుంది అనేది ముఖ్యుల అనుమానం. 

పరువు పోతోంది
ఇతరత్రా విషయాలు పక్కకుబెడితే.. మన దేశం ఇంతకాలం ఇచ్చే గణాంకాలపై ప్రపంచ స్థాయిలో ఎక్కడా, ఎవరూ అనుమానించలేదు. కానీ ఇప్పుడు డౌట్స్ పెరిగిపోతున్నాయి. ఆర్బీఐ వ్యవహారాల్లో జోక్యం, డేటాలో తప్పులతడకలు వంటివి మనల్ని ఆర్థిక సమాజం ముందు చిన్నవి చేస్తాయి. దీని వల్ల పెట్టుబడులపై ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చైనా ఇచ్చే గణాంకాలను చాలావరకూ దేశాలు అంత బలంగా నమ్మవు. ఎందుకంటే వాళ్ల దేశంలో ఏం జరుగుతోందో.. బయటి ప్రపంచానికి వాళ్లు చెబితే తప్ప పెద్దగా తెలియవు. అందుకే వివిధ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా చైనా విషయంలో నిర్ణయాలను ఆచితూచి తీసుకుంటాయి. ఇప్పుడు మన దేశంపై ఈ ముద్ర పడ్తోంది కాబట్టి కొత్త ప్రభుత్వం వీటిని ఎలా సంస్కరిస్తుంది, పారదర్శకతను ఎలా పెంచుతుంది అనే అంశాలను చూడాలి. 

The controversy surrounding the new series of GDP numbers based on the MCA-21 database intensified as 38% of companies that are part of the database could not be traced or were wrongly classified. National dailies reported that this was based on a survey conducted by the National Sample Survey Office (NSSO), a government agency.
 Most Popular