ఎడిల్‌వీజ్‌- జెట్‌ ఎయిర్‌.. దూకుడు

ఎడిల్‌వీజ్‌- జెట్‌ ఎయిర్‌.. దూకుడు

మార్పిడికి వీలులేని డిబెంబచర్ల(NCDలు) జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించడంతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోవైపు ఆర్థిక సమస్యల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలు బిడ్డింగ్‌కు నేడు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టి సారించారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ కన్సాలిడేషన్‌ మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌
ఎడిల్‌వీజ్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ. 300 కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేయనున్నట్లు తాజాగా తెలియజేసింది. 24 నెలల కాలపరిమితిగల ఎన్‌సీడీలకు 9.9 శాతం ఈల్డ్‌ను అందించనున్నట్లు తెలియజేసింది. ఇక 39 నెలల ఎన్‌సీడీలకు 10.2 శాతం ఈల్డ్‌ను ప్రకటించింది. రూ. 150 కోట్ల సమీకరణ కోసం రూ. 1000 ముఖవిలువగల ఎన్‌సీడీలను తొలుత జారీ చేయనున్నట్లు తెలియజేసింది. అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తే మరో రూ. 150 కోట్లను సమకూర్చుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 159 వద్ద ట్రేడవుతోంది.

Image result for Jet airways ltd

జెట్‌ ఎయిర్‌వేస్‌
ఆర్థిక సమస్యతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకి లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు కలిగిన ఆదిగ్రూప్‌ బిడ్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. అనుబంధ సంస్థ ఆదిగ్రో ఏవియేషన్‌ ద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌ టేకోవర్‌కు సిద్ధపడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నష్టాలతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ను టర్న్‌అరౌండ్‌ చేసేందుకు వీలుగా భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఆదిగ్రూప్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. జెట్‌ ఎయిర్‌లో కొనసాగేందుకు ఎతిహాద్‌ ఆసక్తి చూపితే భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు.. ఈ నేపథ్యలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 153 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 158 వరకూ ఎగసింది.