ఎల్ఐసీ వాటా కొన్న స్టాక్స్ ఇవే| మరి మీరేం చేస్తారు?

ఎల్ఐసీ వాటా కొన్న స్టాక్స్ ఇవే| మరి మీరేం చేస్తారు?

ఎల్‌ఐసీ అంటే జీవిత బీమా సంస్థగా జనాలు అందరికీ తెలిస్తే.. ఇన్వెస్టర్ సమాజం మాత్రం ఈ కంపెనీని అతి పెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుగా గుర్తిస్తుంది. అనేక కంపెనీలలో ఎల్ఐసీకి వాటాలు ఉన్నాయి. ముఖ్యంగా పలు లిస్టెడ్ కంపెనీలలో లైఫ్ ఇన్సూరెన్స్ వాటా నియంత్రిత స్థాయిలో వాటా ఉంటుంది. అందుకే ఎల్ఐసీ చేసే పెట్టుబడులపై ఎప్పటికప్పడు ఇన్వెస్టర్లు ఆరా తీస్తుంటారు.

దేశీయ అతి పెద్ద ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్... లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జనవరి-మార్చి త్రైమాసికంలో ఎల్ఐసీ తన పోర్ట్‌ఫోలియోలో పలు కీలక మార్పులు చేసింది. దాదాపు 70 కంపెనీలలో తన వాటాలను కొంత మేర విక్రయించి లాభాలను బుక్ చేసుకున్న ఎల్ఐసీ... 35 కంపెనీలలో షేర్‌లను పెంచుకుంది. ఇతర ఇండెక్స్‌లతో పోల్చితే గత త్రైమాసికంలో బెంచ్‌మార్క్ సూచీలు ఔట్‌పెర్ఫామ్ చేశాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం ఊపందుకుంది. ఇదే సమయంలో సెన్సెక్స్ మాత్రం 7 శాతం ర్యాలీ చేసింది.

డిసెంబర్‌ హోల్డింగ్స్‌తో పోల్చితే.. పలు స్మాల్, మిడ్‌క్యాప్‌లలో వాటాలను విక్రయించి ప్రాఫిట్ బుకింగ్ చేసేందుకు.. క్యూ4లో మార్కెట్ల ర్యాలీని ఎల్ఐసీ ఉపయోగించుకుంది. అయితే ఎల్ఐసీ వాటాలను పెంచుకున్న స్టాక్స్‌లను పరిశీలిస్తే.. ఈ జాబితాలో హెచ్ఈజీ, జేపీ ఇన్ఫ్రాటెక్, టాటా కెమికల్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కాఫీ, గెయిల్ ఇండియా, ఎన్ఎండీసీ, అదాని పోర్ట్స్ వంటి షేర్లు ఉన్నాయి. ఈ స్టాక్స్ దాదాపు 50 శాతం వరకు క్షీణించడం గమనించాలి. ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, భారత్ పెట్రోలియం, ఆయిల్ ఇండియాలతో పాటు పలు ఇతర బ్లూచిప్ కంపెనీలలో ఎల్ఐసీ తన షేర్‌ను పెంచుకుంది.

2019లో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు రికార్డు గరిష్టాలకు ర్యాలీ చేసినా.. ఇది పలు ప్రధాన కౌంటర్లలో లాభాల కారణంగానే అని చెప్పాలి. ఇతర మార్కెట్లు మాత్రం ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయి. అందుకే, తాజా కరెక్షన్ తర్వాత పలు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు బాగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే, ఎల్ఐసీ లాంటి సంస్థ తన వాటాలను పెంచుకుందని, రీటైల్ ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడులు చేయడానికి సిద్ధపడడం సరైన విషయం కాదు. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీల కోసం ఇన్వెస్టర్లు అన్వేషించాలి.

తాజాగా ఎల్ఐసీ చేసిన పెట్టుబడులను పరిశీలిస్తే... అందులే ఉన్న జేపీ ఇన్‌ఫ్రాను కూడా చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తన పోర్ట్‌ఫోలియోను ఎల్ఐసీ మార్చుకుందని.. అంత మాత్రాన ఆయా స్టాక్స్ వాల్యూ పిక్స్ కాబోవని అంటున్నారు. టాటా కెమికల్స్, మహీంద్రా, హెచ్ఈజీ వంటి కొన్ని స్టాక్స్‌ను హోల్ట్ చేయవచ్చని చూస్తున్నారు. దీర్ఘకాలానికి కెమికల్స్ రంగం ఇప్పటికీ ఆకర్షణీయంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ ఊపందుకుంటే ఎం అండ్ ఎం షేర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.

ఎల్ఐసీ వాటాలను పెంచుకున్న స్టాక్స్‌లో... కొన్ని ఉత్తమమైనవి కూడా ఉన్నాయనే అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో వీటిలో ఎంటర్ కావడం సరికాదని ఎనలిస్ట్‌ల సూచన. ఇవి ప్రస్తుత పరిస్థితులను కొంతమేర అధిగమించి, వాటిలో అప్‌ట్రెండ్ మొదలయ్యాక ఎంటర్ కావచ్చని చెబుతున్నారు.

అలాగే రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, పుంజ్‌ లాయిడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీజీ పవర్ వంటి మొత్తం 72 షేర్లలో వాటాలను ఎల్ఐసీ తగ్గించుకుంది. వీటిలో కొన్ని షేర్లు కేవలం 2019లోనే 80 శాతం వరకూ మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. వీటిలో చాలావరకు షేర్లు కార్పొరేట్ సమస్యలు, రేటింగ్ డౌన్‌గ్రేడ్ కావడం వంటి సమస్యలను ఎదుర్కున్నాయి. ఇక ఫైనాన్షియల్ రిజల్ట్స్ విషయంలో కూడా ఇవి ఆశాజనకంగా కనిపించడం లేదు.

2018లో ఎదురైన రుణ సంక్షోభం తర్వాత పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు.. ఇంకా లిక్విడిటీ సమస్యను ఎదుర్కుంటున్నాయి. అందుకే మొత్తం మార్కెట్‌లో సెంటిమెంట్ సానుకూలంగా మారేవరకూ వేచిచూసే ధోరణిని అవలంబించడమే ఉత్తమంగా చెప్పాలి. కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలను ఎదుర్కుంటున్న కంపెనీలలో.. ఆయా సమస్యలకు పరిష్కారం వచ్చేవరకూ ఆగాల్సి ఉంటుంది.

అయితే, ఏ కంపెనీలో అయినా ఎంట్రీ, ఎగ్జిట్ వంటివి స్వయంగా చేసిన రీసెర్చ్ ఆధారంగానే.. ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాలి. స్టాక్స్‌ను ఎంచుకునే సమయంలో ఈ అంశాలను పరిశీలిస్తే.. పోర్ట్‌ఫోలియోను పదిలంగా కాపాడుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌ఐసీ పెట్టుబడి చేసే స్టాక్స్ జాబితాను పరిశీలిస్తే.. స్మార్ట్ మనీ కదలికల సరళి అర్ధం అవుతుంది. అయితే.. షేర్ల కొనుగోలు, విక్రయాలను చేసేందుకు.. దీనినే ప్రామాణికంగా చేసుకోవడం మాత్రం సరికాదు. కార్పొరేట్ గవర్నెన్స్ వంటి తీవ్ర సమస్యలు ఎదురయినప్పుడు.. ఆయా స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయేందుకు సిద్ధంగా ఉండాలి. అలాగే సరైన ధరలో ఏదైనా స్ట్రాంగ్ కంపెనీ షేర్ లభిస్తుందనే అంచనా ఏర్పడినప్పుడు... వాటిలో ఎంట్రీ అయేందుకు కూడా రెడీగా ఉండాలి.

కార్పొరేట్ గవర్నెన్స్‌తో పాటు రుణ సమస్యలు, ఏవైనా తీవ్ర ఇబ్బందులు వంటి ఎదురయినప్పుడు.. ఆయా స్టాక్స్‌ను హోల్డ్ చేయడం సరైన విషయం కాదు. అవి సుదీర్ఘ కాలంపాటు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎక్సైడ్ వంటి స్టాక్‌ను గమనించవచ్చు. గత 20 ఏళ్లుగా ఈ స్టాక్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూనే ఉండగా... ప్రస్తుతం స్వల్పంగా కరెక్షన్‌కు గురవుతోంది. ఇన్వెస్టర్లకు లాభాలు పంచడంలో మాత్రం ఈ కంపెనీకి గల తిరుగులేని రికార్డును పరిశీలిస్తే.. దీనిని వాల్యూ పిక్‌గా చెప్పవచ్చు.