తనఖాలో 90 శాతం షేర్లు.... ఇక వీటికి ఫ్యూచర్ ఉంటుందా ?

తనఖాలో 90 శాతం షేర్లు.... ఇక వీటికి ఫ్యూచర్ ఉంటుందా ?

సాధారణంగా కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను వ్యాపార విస్తరణకో, ఇతర అవసరాలకో బ్యాంకులు లేదా ఇతర ఆర్ధిక సంస్థల వద్ద తనఖా పెట్టి నగదును పొందుతారు. ఈ ప్లెడ్జ్‌డ్ షేర్లు ఒక్కోసారి కంపెనీ స్టాక్స్ ను కింద పడేస్తాయని ఎనలిస్టులు పేర్కొంటూ ఉంటారు. తాజాగా గత డిసెంబర్ త్రైమాసికం నుండి ఈ మార్చ్ త్రైమాసికం వరకూ మార్కెట్లో ఈ ప్లెడ్జ్‌డ్ షేర్ల శాతం 2.53శాతం తగ్గినా..(గత డిసెంబర్‌కు ఇది 2.98శాతం ఉంది) BSE 500 లోని ఓ 30 కంపెనీల ప్రమోటర్ల షేర్లు తనఖాలో ఉండి చిక్కులను ఎదర్కొంటున్నాయి. మార్చ్ 2019 నాటికి మొత్తం ప్రమోటర్ల తనఖా షేర్ల విలువ రూ. 1.95లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇది BSE 500 ఇండెక్స్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ కంటే ఎక్కువ కావడం గమనార్హం. 
ప్రమోటర్లు తమ వద్ద ఉన్న కంపెనీ వాటాలను కుదవ పెట్టి ఆ మొత్తంతో వ్యాపార విస్తరణ, లేదా ఇతర వ్యాపార కార్యకలాపాలకు వాడుతారు. ఎస్సెల్ గ్రూప్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్మెంట్  స్టాక్స్ కూడా ఈ తనఖా వివాదం వల్లనే 5శాతం క్షీణించాయి. డిష్ టీవీ  ప్రమోటర్ల ప్లెడ్జ్‌డ్ షేర్ల వ్యవహారం వల్ల 9శాతం ఆ స్టాక్స్ పడిపోయాయి. ఎస్సెల్ గ్రూప్ తన ప్రమోటర్ల షేర్లను తనఖా పెట్టడం వల్లే ఆ కంపెనీ స్టాక్స్ ధరలు గణనీయంగా పతనమయ్యాయని శామ్‌కో సెక్యూరిటీస్ సంస్థ పేర్కొంది.  ఇలా కంపెనీలు తమ వాటాలను  హామీలుగా పెట్టి రుణాలు పొందినప్పుడు అవి కంపెనీ క్షీణతను సూచిస్తాయి కాబట్టి ఇలాంటి కంపెనీల స్టాక్స్ కొనకుండా ఉండటమే ఉత్తమమని శామ్‌కో సెక్యూరిటీస్ మదుపర్లకు సూచిస్తుంది. ఒక వేళ తనఖా పెట్టిన షేర్లను అప్పు ఇచ్చిన సంస్థ తిరిగి అమ్ముకుంటే అప్పుడు కంపెనీ పరిస్థితి మరింత దిగజారుతుంది. సాధారణ ఇన్వెస్టర్ల వద్ద ఉన్న స్టాక్ ప్రైస్‌ మరింత పడిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చని శామ్‌కో సంస్థ పేర్కొంది. 

image (2)
బీఎస్‌ఈ-500లోని దాదాపు 30 కంపెనీలు తమ ప్రమోటర్ల వాటాలను పలు సంస్థల వద్ద తనఖా పెట్టాయని సెబీ వెల్లడించింది. వాటిలో JK టైర్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, డిష్ టీవీ, VA టెక్‌ వాబాగ్ , ఆదాని ట్రాన్స్ , పరాగ్ మిల్క్, జీ ఎంటర్ టైన్మెంట్ , JSW ఎనర్జీ, మ్యాక్స్ ఇండియా, సన్ ఫార్మా, వంటి కంపెనీలు తమ ప్రమోటర్ల వాటాలను తనఖా పెట్టాయని కోటక్ సెక్యూరిటీస్ తన సర్వేలో వెల్లడించింది. డిసెంబర్ 2018 నాటికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ ప్రమోటర్ షేర్లను 74.6 శాతం తనఖా పెట్టగా (ప్లెడ్జ్ షేర్లు) , ఇది 2019 మార్చ్ నాటికి 96.9శాతంకు పెరిగింది. అంటే .. కంపెనీ యాజమాన్యం పూర్తిగా కంపెనీ మీద హక్కులను వదులుకోవాల్సి రావొచ్చు. డిష్ టీవీ కూడా 2018లో తన వాటాలను 82.1శాతం కుదవ పెట్టగా, ఇది 2019 మార్చ్ నాటికి 94.6శాతంకు చేరింది. ప్రముఖ టైర్ల కంపెనీ అయిన జేకే టైర్స్ కూడా మార్చ్ 2019 నాటికి తన ప్రమోటర్ వాటాలలో 28.9శాతం రుణ సంస్థలకు కుదవ పెట్టడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. 
ఏది ఏమైనా ఇలా కంపెనీల స్టాక్స్ మనదగ్గరున్నా..వెంటనే వాటిని వదలించుకోవడం మేలని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులు పేర్కొంటున్నారు.