నియోజెన్‌ కెమికల్స్‌ లిస్టింగ్‌ నేడు

నియోజెన్‌ కెమికల్స్‌ లిస్టింగ్‌ నేడు

బ్రోమైన్, లిథియం ఆధారిత స్పెషాలిటీ కెమికల్స్‌ రూపొందించే నియోజెన్‌ కెమికల్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నేడు లిస్ట్‌కానుంది. నియోజెన్‌ గత నెలాఖరున చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించింది. ఏప్రిల్‌ 26తో ముగిసిన ఇష్యూ 41 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. షేరుకి 212-215 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా నియోజెన్‌ కెమికల్స్‌ రూ. 132 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ఆఫర్‌ 43.29 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. దాదాపు 17.81 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలుకావడం విశేషం!

స్పందన తీరిలా
నియోజెన్‌ కెమికల్స్‌ ఐపీవోకు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(QIB) కోటాలో 30.42 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఈ బాటలో సంపన్న వర్గాలు(హెచ్‌ఎన్‌ఐలు) విభాగంలో 114.73 రెట్లు అధికంగా బిడ్స్‌ లభించగా.. రిటైల్‌ విభాగంలోనూ 15.67 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తడం గమనించదగ్గ అంశం! ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 70 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేసింది. షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి.