ఈ డేటా చూస్తే.. భయమేస్తుంది... ప్రతీ ఇన్వెస్టర్ చదవాల్సిన స్టోరీ!!

ఈ డేటా చూస్తే.. భయమేస్తుంది... ప్రతీ ఇన్వెస్టర్ చదవాల్సిన స్టోరీ!!

దేశంలోని వ్యాపార రంగాలు మాంద్యంలో ఉన్నాయా? సగటు వినియోగ దారుడి కొనుగోలు శక్తి క్రమ క్రమంగా క్షీణిస్తుందా? రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఆదాయం తరుగుదల కనబడుతోందా? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమిస్తున్నారు ఆర్ధిక విశ్లేషకులు. మార్కెట్లోని వినిమయ వస్తువులైన కార్లు, టూ వీలర్స్, ఎయిర్ ట్రావెల్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (FMCG) వంటి రంగాల్లో సెల్లింగ్ వాల్యూమ్స్ పడిపోతున్నాయి. వీటి డిమాండ్ తగ్గడంతో కొనుగోలు దారులు లేక ఆయా కంపెనీలు ఆదాయ వృద్ధిలో మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు త్రైమాసిక ఫలితాల్లో ఈ రంగాల్లో క్షీణత కనబడుతోంది. వీటికి ప్రధాన కారణం రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడమేనని , తద్వారా వినియోగ దారుల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో విక్రయాలు మందకోడిగా సాగుతున్నాయని ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజల ఆదాయంలో కూడా తిరోగమనం ఏర్పడటం, ప్రైవేట్ పెట్టుబడులు , ఎగుమతులు లేక పోవడంతో మార్కెట్లలో నగదు ప్రవాహం తగ్గిపోతుంది. ఈ ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం తక్షణ నష్ట నివారణ చర్యలకు దిగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.

 Image result for FMCG
FMCG రంగానికి గడ్డు కాలం...!
ఇక FMCG రంగానికొస్తే.. ఇప్పటికే పలు కంపెనీలు తమ క్వార్టర్ ఫలితాలలో ఆదాయన్ని గణనీయంగా కోల్పోయామనే వెల్లడించారు. FMCG రంగంలో మాంద్యం ఉంది కానీ, ఆ మాంద్యం నిరోధకతను కలిగి ఉండొచ్చని ప్రముఖ FMCG కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ ఛైర్మన్ సంజీవ్ మెహతా తన మార్చ్ త్రైమాసిక ఫలితాల ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వినియోగదారులు నిత్యావసర వస్తువులైన సబ్బులు, టూత్ పేస్టులు కొనడం మానలేదు.. కానీ, బ్రాండెడ్ వస్తువులపై వ్యామోహం తగ్గించుకుని తక్కువ ధరలు కలిగిన వస్తువులు కొనడం మొదలెట్టారు. ఇది FMCG రంగానికి ప్రతిఘాతంగా మారిందని సంజీవ్ మెహతా అంటున్నారు. 
Image result for FMCG
ఇక FMCG కంపెనీలైన HUL, బ్రిటానియా, డాబర్ , GCPL సంస్థల సగటు వాల్యూమ్ గ్రోత్  ఈ మార్చ్ నాటికి కేవలం 6శాతం నమోదు అయింది. గత త్రైమాసికం కంటే ఇది 2.66 శాతం మాత్రమే ఎక్కువ. రానున్న జూన్ -జూలై వరకూ FMCG కంపెనీల విక్రయాల్లో మాంద్యం కొనసాగవచ్చని FMCG కంపెనీలు భావిస్తున్నాయి. గత 6 త్రైమాసికాల నుండి చూస్తే.. హిందుస్థాన్ యూనీ లివర్ వాల్యూమ్ గ్రోత్ 7శాతం దిగువకు పడిపోయింది.
Image result for indian farmers
పంట దిగుబడి, రాబడి రెండూ శూన్యం..!
పంట ఆదాయాలు దేశంలో గత రెండు సంవత్సరాల నుండి తగ్గిపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. ఆదాయ పెరుగుదల లేక గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధార పడిన శ్రామికుల కొనుగోలు శక్తి హరించుకుపోతుంది. గత 2018 అక్టోబర్ , డిసెంబర్ మధ్య కాలంలో దేశ జీడీపీలో వ్యవసాయం నుంచి వచ్చిన వృద్ధి రేటు కేవలం 2శాతం కావడం గమనార్హం. 2012 ఎప్రిల్- జూన్ కాలం నుండి అత్యంత కనిష్టం కావడం విశేషం. మరోవైపు వస్తువులపై ధరల తగ్గింపు, వస్తువులపై పన్ను తగ్గింపు (GST) వంటి వాటి కారణంగా కంపెనీలు లాభదాయకతను కోల్పోయాయి. దేశంలో నగదు ప్రవాహం కూడా తగ్గిపోవడం, గత సంవత్సరం సెప్టెంబర్‌లో IL&FS సంక్షోభం వంటివి కూడా ప్రైవేటు సెక్టార్‌లోని నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఇతర పెట్టుబడి సంస్థలకు లిక్విడిటీ సమస్యలను తెచ్చిపెట్టాయి. క్రెడిట్ సూసీ అంచనాల ప్రకారం 2016 నుండి ద్రవ్య సరఫరా క్షీణించడంతో బాటు GDP వృద్ధి రేటు మందగించింది. 
ఇక మధ్యతరగతి వినియోగ దారులు తమ ఆదాయంలో పెరుగుదల లేక పోవడంతో కొనుగోళ్ళ విషయంలో నియంత్రణను పాటిస్తున్నారు. దీంతో పలు రంగాల్లో విక్రయాలు పూర్తిగా మందగించాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. దేశ వినియోగ దారుల సగటు ఆదాయ పెరుగుదలలో తగ్గుదల, జీడీపీ గ్రోత్ వంటివి వస్తు వినిమయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని , ఈ ధోరణి గత 2017 నుండి కనిపిస్తుందని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. పట్టణ, మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధిక వృద్ధి పెరుగుదల కేవలం 1.1శాతమే ఉండటం, జీత భత్యాలు, ఇతర ఆదాయ వనరులు పెరగకపోవడం వంటి కారణాలతో అన్ని రంగాల్లో కొనుగోళ్లు నెమ్మదించాయి.

Image result for auto sector
ఆటో రంగం గతుకుల ప్రయాణం..! 

ఇక ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే... వీటి వాల్యూమ్ గత 10 నెలల్లో 9శాతం పడిపోయింది. అమ్మకాల వృద్ధి కూడా 2శాతం పడిపోవడం గమనార్హం. గత ఆర్ధిక సంవత్సరం నుండి లెక్కిస్తే... అమ్మకాలు దాదాపు 5శాతం వరకూ పడిపోయాయి.రూరల్ ఎరియాస్‌లో FMCG అమ్మకాలు కేవలం 0.3శాతం పెరగాయి. మరి కొన్ని చోట్ల గత 6-7 త్రైమాసికాల కనిష్టానికి పడిపోయాయి.టూవీలర్స్ పరిస్థితి కూడా పూర్తిగా నిరాశజనకంగా ఉంది. నోట్ల రద్దు నుంచి ఇప్పటిదాకా టూ వీలర్స్ అమ్మకాలు మందకోడిగానే సాగుతున్నాయని ఆటో రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత మార్చ్‌ వరకూ ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రయాణీకుల సంఖ్య 11.6 మిలియన్లుగా ఉంది. ఇది గత సంవత్సరం కంటే కేవలం 0.1 శాతం మాత్రమే అధికం. 2013 జూన్ నుండి ఇప్పటిదాకా విమాన ప్రయాణాల్లో ఆక్యుపెన్సీ చాలా నెమ్మదించిందని ఫ్లైట్ ఆక్యుపెన్సీ నిపుణులు పేర్కొంటున్నారు. 

Image result for auto sectorImage result for two wheeler
2019 ఎప్రిల్ నాటికి మారుతీ సుజుకీ వాల్యూమ్స్ 17.2శాతం క్షీణించాయి. ఇది గత2012 నుండి చూస్తే..అత్యంత కనిష్టంగా చెప్పుకోవచ్చు. మారుతీకి చెందిన టాప్ సెల్లింగ్ మోడల్స్ బాలెనో, డిజైర్ , సిఫ్ట్ వంటి కార్ల విక్రయాలు కూడా 15-31శాతం క్షీణించాయి (YoY బేసిస్‌లో) . గత 5 సంవత్సరాల నుండి మోటార్ వాహనాల అమ్మకాల్లో పెరుగుదల నెమ్మదించిందని, మరోవైపు కాలుష్య ఉద్గారాల నియంత్రణ నిబంధనల వల్ల ధరల మార్పులకు కస్టమర్లు సంతృప్తిని వ్యక్తం చేయలేదని , ఇందువల్లే ఈ ఆర్ధిక సంవత్సరం నష్టభయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మారుతీ సుజుకీ CFO అజయ్ సేథ్  పేర్కొన్నారు. టూవీలర్స్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచుమించు ఆలాగే ఉంది. గతంలో వినియోగ దారులకు నాన్ బ్యాంకింగ్ సంస్థలు విరివిగా టూవీలర్ లోన్లు మంజూరు చేసేవని, కానీ ఇప్పుడు లిక్విడిటీ సమస్యలతో అవి వెహికిల్ లోన్స్ ఇవ్వలేక పోవడంతో కూడా విక్రయాల్లో మాంద్యం ఎర్పడిందని బజాజ్ ఆటో సంస్థ పేర్కొంది. 
కొత్త ప్రభుత్వం ఎర్పడ్డాక సత్వర చర్యలు తీసుకుంటేనే ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిన పడనుంది. లేక పోతే..ఇటు కంపెనీలు, అటు మార్కెట్లు రెండు విధాల నష్టపోతాయని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లలోకి నగదు ప్రవాహం నానాటికీ తీసికట్టుగా మారడం కూడా ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగితేనే.. కంపెనీలు , మార్కెట్లు పుంజుకుంటాయని ఆర్ధిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.