రేపే అక్షయ తృతీయ..! బంగారం కొనుగోలుకు మదుపర్ల ఆసక్తి 

రేపే అక్షయ తృతీయ..! బంగారం కొనుగోలుకు మదుపర్ల ఆసక్తి 

అక్షయ తృతీయ  రోజున బంగారం కొనుగోలు చేస్తే సంపద కలిసి వస్తుందన్నది చాలా మంది విశ్వాసం. అయితే గత కొంత కాలంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయినా ధర మాత్రం ముందుకే సాగుతోంది. పెట్టుబడి దృక్పథంతో ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా.. వద్దా?  సంవత్సరం చివరినాటికి ధర ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది? అక్షయ తృతీయ ఎఫెక్ట్ తో పసిడి కొనుగోలు కలిసొస్తుందా..? 
భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయ, ధన త్రయోదశి వంటి పర్వదినాల్లో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నగల వ్యాపారులు ఆకర్షణీయమైన స్కీములు, డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తుంటారు.అక్షయ తృతీయ ఈసారి మే నెల  7వ తారీఖున వచ్చింది.  గత ఏడాది కాలంలో పసిడి ధర 14 శాతం వరకు పెరిగింది. ఈ 12 నెలల కాలంలో ఒక దశలో 10 గ్రాముల పసిడి ధర రూ.34,031 స్థాయికి కూడా పోయింది. కొన్ని అడ్డంకులు ఉన్నా, ఈ సంవత్సరం కూడా బులియన్‌ మార్కెట్‌ మదుపరులకు మంచి లాభాలే ఇస్తుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
వచ్చే ఆరు నెలల్లో ఔన్స్‌ బంగారం ధర 1,250 నుంచి 1,365 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఇది సుమారు రూ.87,500 నుంచి రూ.95,550కు సమానం. పరిస్థితులు అనుకూలిస్తే సంవత్సరాంతానికి ఔన్స్‌ పసిడి ధర 1,400 డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే స్వల్ప, మధ్య కాలానికి మాత్రం మదుపరులు అప్రమత్తతతో ఉండాలని విశ్లేషకులు  సూచిస్తున్నారు. 
ఇక అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికాలోనూ జీడీపీ వృద్ధి రేటు నీరసిస్తోంది. దీంతో ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ ఇంతకు ముందు ప్రకటించిన విధంగా, సమీప భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం కనిపించడం లేదు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎంత తక్కువగా ఉంటే బులియన్‌ మార్కెట్‌ అంత బాగుంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే మాత్రం పసిడి ధర అందుకు వ్యతిరేక దిశలో పయనిస్తుంది.అమెరికా-చైనా మధ్య చెలరేగిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దీనికి తోడు ఈయూ, చైనా, జపాన్‌లలోనూ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు తాజాగా ఇందుకు తోడయ్యాయి. ఇవన్నీ పసిడి మార్కెట్‌ను మరింత ముందుకు నడిపించడానికి దోహద పడనున్నాయి. 
 బంగారానికి డిమాండ్‌ ఉన్న స్థాయిలో సరఫరా లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి సరఫరా ఒక శాతం మాత్రమే పెరిగి 4,707 టన్నులకు చేరుతుందన్నది మార్కెట్‌ వర్గాల అంచనా. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో ఆలోచిస్తే బంగారం ప్రస్తుత ధర ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఫండమెంటల్స్‌ పరంగా స్వల్పకాలానికి చూస్తే మాత్రం, అంత ఆకర్షణీయంగా లేదు. 21 రోజులు, 50 రోజుల సగటు కదలిక పరంగా చూస్తే భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.30,600 నుంచి రూ31,130 మధ్య ట్రేడవుతోంది. ధర మరింత తగ్గి రూ.30,000 నుంచి రూ.30,500 స్థాయికి వస్తే మదుపరులు దాన్ని మద్దతు ధరగా పరిగణించి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవచ్చు. సంవత్సరాంతానికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 33,500 నుంచి రూ.34,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల బంగారం మీద ముదపర్లు పెట్టుబడులు పెట్టడం పూర్తిగా సురక్షితమేనని  బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.