నాకు రూ.15 వేల కోట్లు కావాలి ! అ'నిల్' అంబానీ ఆఖరి పోరాటం..!

నాకు రూ.15 వేల కోట్లు కావాలి ! అ'నిల్' అంబానీ ఆఖరి పోరాటం..!


2008లో అనిల్‌ అంబానీ గ్రూపు మార్కెట్‌ క్యాప్‌ 100 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు 4 బిలియన్‌ డాలర్ల స్థాయికి గ్రూపు కంపెనీల విలువ పడిపోయింది. ఇప్పటికే నష్టాలు, అప్పుల బాధలతో కునారిల్లుతున్న అనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై ప్రముఖ రేటింగ్ సంస్థలు కూడా ఆయా రేటింగ్స్ ను తగ్గించి వేశాయి. దీంతో అడాగ్ షేర్లు మరింత పతనం కానున్నాయి. పలు కంపెనీల్లో ఉన్న వాటాలను విక్రయించుదామంటే.. ఆ ప్రతిపాదనలు ఆలస్యం కావడం అనిల్ అంబానీని మరింత చికాకు పరుస్తున్నాయనే చెప్పాలి. 
తాజాగా కేర్‌ రేటింగ్స్‌ సంస్థ రిలయన్స్‌ క్యాపిటల్‌ సబ్సిడరీ కంపెనీలు రిలయన్స్‌ హోమ్‌ఫైనాన్స్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ డెట్‌ ఇనుస్ట్రుమెంట్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసి... ఏకంగా 'D' రేటింగ్‌ ఇచ్చింది. అంటే డిఫాల్ట్‌ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నట్టే లెక్క.  దేశంలోని ఐదవ అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థకు  ప్రమోటింగ్‌ కంపెనీ అయిన రిలయన్స్‌ క్యాపిటల్‌ దగ్గర మార్చి నాటికి కేవలం రూ.11 కోట్లే నగదు నిల్వలు ఉన్నాయని కేర్‌ రేటింగ్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూపునకు ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోవాలంటే ఉన్న వ్యాపారాలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో అనిల్‌ అంబానీ ఉన్నారు. కానీ, వ్యాపారాలు అమ్ముకోవడం కూడా కష్టతరంగా మారింది. ఆస్తులను విక్రయిద్దామనుకుంటే ఆయా వ్యాపారాల మార్కెట్‌ విలువ రోజురోజుకూ పతనమవుతోంది. దీంతో అమ్మినా అనుకున్నంత రాని గడ్డు పరిస్థితులను అనిల్‌ ఎదుర్కొంటున్నారు. 
2018 సెప్టెంబర్‌ నాటికి అనిల్‌కు చెందిన ఏడు లిస్టెడ్‌ కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ విలువ రూ.22,238 కోట్లు అయితే, ఈ కంపెనీల ఉమ్మడి రుణం రూ.1,36,000 కోట్లు. ఇక మార్కెట్‌ క్యాప్‌లో సగానికి సగం రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీదే కావడం గమనార్హం. ఇప్పుడు అనిల్‌ అంబానీ విక్రయించే జాబితాలో రిలయన్స్‌ నిప్పన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో వాటాలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలో రిలయన్స్‌ క్యాపిటల్‌కు 42.9 శాతం వాటాలున్నాయి. మే నాటికి విక్రయాన్ని పూర్తి చేయాలనుకోగా, అది జూన్‌ చివరికి అవుతుందని అంచనా. ఇది కూడా అమ్మేస్తే వచ్చే మొత్తం రూ.7,000 కోట్లు. అలాగే, రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 49 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.1,700 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇంకా మహీంద్రా ఫస్ట్‌చాయిస్‌, ప్రైమ్‌ ఫోకస్‌లో వాటాల విక్రయ ప్రతిపాదనలు కూడా ఆలస్యమవుతున్నాయి. ఆర్‌కామ్‌, ఆర్‌పవర్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఈ నాలుగు కంపెనీల రుణాలే గ్రూపు మొత్తం రుణాల్లో 60 శాతం వాటా ఆక్రమిస్తాయి. దీంతో రుణాలిచ్చిన సంస్థలు లిక్విడేషన్‌కు మొగ్గు చూపితే అనిల్‌ అంబానీ పరిస్థితి మరింత ఘోరంగా మారొచ్చు.
మరో వైపు కేర్ రేటింగ్ సంస్థతో బాటు మూడీస్, ICRA వంటి ఇతర సంస్థలు కూడా అనిల్ అంబానీకి చెందిన సంస్థల రేటింగ్స్ ను తగ్గించాయి. దీంతో పరిస్థితి మరింత దిగజారిందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అనిల్ అంబానీ తాత్కాలికంగా గట్టెక్కాలంటే అత్యవసరంగా రూ.15,000 కోట్లు కావాల్సిందేనని బ్యాంకింగ్ డెట్ నిపుణులు పేర్కొంటున్నారు.