4 నెలల కనిష్టానికి పసిడి

4 నెలల కనిష్టానికి పసిడి

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో డాలరు జోరందుకుంది. దీంతో బంగారంలో అమ్మకాలు పెరుగుతున్నాయి. ఫలితంగా విదేశీ మార్కెట్లో పసిడి ధరలు 4 నెలల కనిష్టానికి చేరాయి. గురువారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 1271 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్‌ గోల్డ్‌ ధరలైతే తొలుత 1266 డాలర్ల దిగువకు చేరాయి. పసిడి ధరలు 2018 డిసెంబర్‌ తదుపరి ఈ స్థాయికి చేరడం మళ్లీ ఇప్పుడేనంటున్నారు విశ్లేషకులు. ఈ వారం ఇప్పటివరకూ పసిడి ధరలు 1.2 శాతం నీరసించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఎన్‌వైఎస్‌ఈ కామెక్స్‌లో 1273 డాలర్ల సమీపంలో పసిడి జూన్‌ ఫ్యూచర్స్‌ కదులుతున్నాయి..

ఏం జరిగిందంటే
ఈ వారం మొదట్లో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను నిర్వహించింది. దాదాపు యథాతథ వడ్డీ రేట్ల అమలుకే నిర్ణయించింది. అయితే ఇటీవల ద్రవ్యోల్బణం బలహీనపడుతున్న కారణంగా రేట్ల తగ్గింపు సంకేతాలు అందుతాయని పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ధరల మందగమనానికి ఇతర అంశాలు కారణమవుతున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పాలసీ సమీక్ష సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది చివరికల్లా ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గుచూపవచ్చన్న అంచనాలకు చెక్‌ పడింది. దీంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో తాజాగా డాలరు 98.33ను తాకింది. ఇది దాదాపు రెండేళ్ల గరిష్టంకావడంతో బంగారంలో అమ్మకాలు నమోదవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాధారణంగా డాలరు బలపడటం లేదా వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులు.. పసిడి గిరాకీని దెబ్బతీస్తాయని వివరిస్తున్నారు. 

ఉపాధి గణాంకాలు
ఏప్రిల్‌ నెలలో అమెరికాలో ప్రయివేట్‌ రంగ ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 2.75 లక్షలుగా నమోదయ్యాయి. విశ్లేషకులు 1.8 లక్షల ఉద్యోగాల నమోదును అంచనా వేశారు. ఇది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిదర్శనంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం, స్టాక్‌ మార్కెట్ల పతనం, వడ్డీ రేట్ల క్షీణత వంటి అంశాలు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్‌ను పెంచే విషయం విదితమే.

దేశీయంగా ఇలా
బులియన్‌ ధరలు దేశీయంగా ఫ్యూచర్ మార్కెట్లో అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల జూన్‌ ఫ్యూచర్స్‌ రూ. 37 క్షీణించి రూ. 31,308 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో వెండి కేజీ జులై ఫ్యూచర్స్‌ దాదాపు యథాతథంగా రూ. 36,704 వద్ద కదులుతోంది. కాగా.. డాలరుతో మారకంలో రూపాయి 69.28 వద్ద ట్రేడవుతోంది. బుధవారం మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం ఒక దశలో 70 సమీపానికి పతనమైంది. రూపాయి బలహీనపడితే పసిడి దిగుమతులు ఖరీదయ్యే సంగతి తెలిసిందే.