ఒక్క 'సూపర్ యాప్'తో అన్ని కంపెనీలకూ చెక్ పెట్టబోతున్న అంబానీ

ఒక్క 'సూపర్ యాప్'తో అన్ని కంపెనీలకూ చెక్ పెట్టబోతున్న అంబానీ

ఒకే ఒక్క సర్వీస్‌తో, మార్కెట్‌లో దిగ్గజాలుగా ఉన్న అందరికీ ముచ్చెమటలు పట్టించడం ఎలా? ఈ ప్రశ్నకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ దగ్గర అత్యధికంగా సమాధానాలు ఉండవచ్చు. ఇప్పటికే రిలయన్స్ జియో అంటూ టెలికాం కంపెనీలకు, జియో ఫోన్ అంటూ ఫీచర్ ఫోన్ హ్యాండ్‌సెట్ మేకర్లకు షాక్ ఇచ్చి.. జియో గిగాఫైబర్ అంటూ బ్రాడ్‌బ్యాండ్, డీ2హెచ్ మార్కెట్లపై ఆధిపత్యం కోసం వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీయన కన్ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై పడిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు అగ్రస్థానాలలో ఉన్న ఈ మార్కెట్‌లో అత్యంత అనువైన విషయం... స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా ఆర్డర్‌ చేయగలగడమే. ఈ మార్కెట్లో ప్రస్తుతం అనేక కంపెనీలు ఉండగా, వేటి ప్రత్యేకతను అవి నిలబెట్టుకుంటూ సాగుతున్నాయి. ఇప్పుడు 'సూపర్ యాప్'తో మార్కెట్లోకి రానున్నారు ముకేష్ అంబానీ. ఇందులో 100 రకాల సర్వీసులను ఒకే ప్లాట్‌ఫామ్‌పై అందించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం జియోకు 30 కోట్లకు పైగా కస్టమర్‌లు ఉన్నారు. డేటాగిరీలో భాగంగా వీరికి హైస్పీడ్ డేటాతో పాటు, ఉచిత వాయిస్ కాల్స్ సదుపాయం కూడా లభిస్తోంది. నిపుణులు చెబుతున్న ప్రకారం, ఈ సూపర్ యాప్‌ ఇండియాకు వుయ్‌ఛాట్ వంటిది కానుండడంతో పాటు, రిలయన్స్‌ను అగ్రస్థానంలో నిలిపే అవకాశం ఉంది. స్నాప్‌డీల్, పేటీఎం, ఫ్రీఛార్జ్, ఫ్లిప్‌కార్ట్, హైక్ వంటి యాప్‌లు దక్కించుకోవడంలో విఫలమైన మార్కెట్‌నే ఈ సూపర్ యాప్ లక్ష్యంగా చేసుకోవడం గమనించాలి.

 

అంతా జియో డివైజ్‌ల సపోర్ట్‌తోనే

"జియో అందించిన, అందిస్తున్న ప్రత్యేకమైన పరికరాలు అనేక రకాల విశిష్టతలను కలిగి ఉండడమే, రిలయన్స్‌కు అత్యంత కీలకమైన బలం కానుంది. తమ కస్టమర్‌లను విస్తృత వ్యవస్థకు అనుసంధానం చేసి, వివిధ రకాల సర్వీసులు అందిస్తూ, ఆన్‌లైన్-ఆఫ్‌లైన్‌లో కూడా కనెక్ట్ కాగలిగేలా సపోర్ట్ చేయడమే, ఈ సూపర్ యాప్ ప్రత్యేకత అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ-కామర్స్ సర్వీసులు, ఆన్‌లైన్ బుకింగ్స్‌, చెల్లింపులు వంటి అన్నిటినీ ఒకేచోట నిర్వహించుకునే సౌలభ్యాన్ని ఈ సూపర్ యాప్ సపోర్ట్ చేయనుంది.

"భారతదేశంలో మొబైల్ ఫోన్స్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ఆధారంగా, సౌకర్యాన్ని అందించే సర్వీసులకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

 

జియో స్టోర్‌లో ఇవన్నీ ఉన్నాయ్

ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్‌తో సంభాషణలు, వాయిస్ టెక్ లేయర్, లాజిస్టిక్స్ లేయర్, ఇంకా ఏఐ ఆధారిత ఎడ్యుకేషన్ లేయర్ కూడా ఇపప్పుడు రిలయన్స్ జియో వద్ద ఉన్నాయి. వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను జియో పరికరాలు అగ్రస్థానంలో నిలుపుతాయనే అంచనాలున్నాయి.

మన దేశంలో ఈకామర్స్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2017లో ఇది 24 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2021నాటికి 84 బిలియన్ డాలర్లను అందుకుంటుందని డెలాయిట్ ఇండియా, రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు తాజాగా అందించిన నివేదికలో వెల్లడించాయి. ఈ మార్కెట్లో రిలయన్స్ ఎంట్రీ ఇస్తుండడంతో, ఇప్పుడు ఇతర కంపెనీలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది విక్రేతల జీవితాలలో మార్పు తీసుకువచ్చే స్థాయిలో, కొత్త కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉండాలన్నది... ముకేష్ అంబానీ లక్ష్యం అంటున్నారు. టెక్నాలజీ సహాయంతో భారీ సంస్థలు, ఈ-కామర్స్ దిగ్గజాలు చేస్తున్న వ్యాపారాన్ని, అతి సులువుగా స్థానిక విక్రేతలు అందుకునేలా చేయడం సాధ్యం అవతుతుందని అంచనా. గతేడాది నవంబర్‌లో జరిగిన "మేక్ ఇన్ ఒడిషా కాంక్లేవ్‌"లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్ టు ఆఫ్‌లైన్ మార్కెట్ గురించి రిలయన్స్ వెల్లడించింది.

 

ఇవీ జియో ఫైనాన్షియల్స్

మొబిలిటీ వ్యాపారంలో ఇప్పటికే విజయవంతంగా పాదం మోపిన జియో... ఇప్పుడు గృహాలు, వాణిజ్య సముదాయాలకు తగిన విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నెక్స్‌జెన్ కనెక్టివిటీ మార్కెట్‌ను, గిగాఫైబర్‌తో అందించేందుకు సిద్ధం అవుతోంది. ఇక జియో ఫైనాన్షియల్స్‌ను గమనిస్తే, 2018-19 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు, వార్షికంగా 64.7 శాతం పెరిగాయి. స్టాండలోన్ నికర లాభం రూ. 510 కోట్ల నుంచి రూ. 840 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రూ. 7218 కోట్ల ఆదాయం ఆర్జించిన జియో, ప్రస్తుతం రూ. 11,106 కోట్ల రెవెన్యూ గడించింది.