సెన్సెక్స్‌ ఖుషీ- మెటల్‌, బ్యాంక్స్‌ దన్ను

సెన్సెక్స్‌ ఖుషీ- మెటల్‌, బ్యాంక్స్‌ దన్ను

మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో హషారుగా కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 336 పాయింట్లు జంప్‌చేసి 39,067 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్ మరోసారి 39,000 పాయింట్ల మార్క్‌కు ఎగువన నిలిచింది. నిఫ్టీ సైతం 113 పాయింట్లు జమ చేసుకుని 11,755 వద్ద స్థిరపడింది. ఎఫ్‌అండ్‌వో ముగింపు, ముడిచమురు ధరల సెగ, దేశీ కరెన్సీ రూపాయి పతనం వంటి ప్రతికూలతల కారణంగా గురువారం చివర్లో అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు దెబ్బతిన్న విషయం విదితమే. 

ఆటో స్కిడ్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ 1.6 శాతం స్థాయిలో ఎగశాయి. ఆటో 1 శాతం, రియల్టీ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌ 7 శాతం దూసుకెళ్లగా, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, సిప్లా, యాక్సిస్, ఎస్‌బీఐ, టీసీఎస్‌ 4-2 శాతం మధ్య  జంప్‌చేశాయి. అయితే టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఎయిర్‌టెల్‌, మారుతీ, హీరో మోటో, కోల్‌ ఇండియా, వేదాంతా 3-0.5 శాతం మధ్య క్షీణించాయి. 

మిడ్‌ క్యాప్‌ వీక్‌
మార్కెట్లు మంచి లాభాలతో ముగిసినప్పటికీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1092 లాభపడగా.. 1431 నష్టాలతో నిలిచాయి.   

డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 3786 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4067 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 975 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 657 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular