3ఎం పతనం- ఎస్‌బీఐ లైఫ్‌ జోష్‌

3ఎం పతనం- ఎస్‌బీఐ లైఫ్‌ జోష్‌

అమెరికన్‌ మాతృ సంస్థ 3ఎం ఈ ఏడాది(2019) నికర లాభాలు తగ్గవచ్చంటూ అంచనాలను(గైడెన్స్‌) ప్రకటించడంతో దేశీయంగానూ ఈ ప్రభావం కనిపిస్తోంది. దేశీ అనుబంధ సంస్థ 3ఎం ఇండియా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో సానుకూల మార్కెట్లోనూ 3ఎం ఇండియా షేరు నష్టాలతో కళతప్పింది. కాగా.. మరోపక్క విదేశీ రీసెర్చ్‌ సంస్థలు బుల్లిష్‌గా స్పందించడంతో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ కౌంటర్ జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం..

3ఎం ఇండియా
అమెరికన్ మాతృ సంస్థ 3ఎం ఈ ఏడాది ఐదు యూనిట్ల పనితీరు మందగించనున్నట్లు గురువారం పేర్కొంది. దీంతో లాభదాయకత క్షీణించనున్నట్లు తెలియజేసింది. అమ్మకాలు నీరసించనున్న కారణంగా 2019లో 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా ఈ షేరు మూడు దశాబ్దాలలోలేని విధంగా 14 శాతం కుప్పకూలింది. ఈ ప్రభావంతో డోజోన్స్‌ నష్టాలతో ముగిసింది. కాగా.. దేశీయంగా 3ఎంకు అనుబంధ సంస్థ అయిన 3ఎం ఇండియా కౌంటర్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3ఎం ఇండియా షేరు 4.6 శాతం పతనమై రూ. 23,725 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 23,642 వరకూ జారింది.

Image result for sbi life insurance

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
గతేడాది(2018-19) క్యూ4(జనవరి-మార్చి)లో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్ నికర లాభం 20 శాతం పెరిగి రూ. 458 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 55 శాతం ఎగసి రూ. 15,601 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేరుకి విదేశీ బ్రొకింగ్ సంస్థలు జెఫరీస్‌, డాయిష్‌ బ్యాంక్‌ బయ్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. ఎస్‌బీఐ లైఫ్‌ షేరుకి రూ. 745 టార్గెట్‌ ధరను జెఫరీస్‌ ప్రకటించగా.. రూ. 830కు చేరవచ్చంటూ డాయిష్‌ బ్యాంక్‌ ఆశావహంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 638 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 643ను సైతం అధిగమించింది.Most Popular