మెటల్‌, ఐటీ పుష్‌- చిన్న షేర్లు బోర్లా

మెటల్‌, ఐటీ పుష్‌- చిన్న షేర్లు బోర్లా

మే నెల డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 108 పాయింట్లు పెరిగి 38,839కు చేరింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు బలపడి 11,688 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌అండ్‌వో ముగింపు, ముడిచమురు ధరల సెగ, దేశీ కరెన్సీ రూపాయి పతనం వంటి ప్రతికూలతల కారణంగా గురువారం చివర్లో అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు దెబ్బతిన్న విషయం విదితమే. 

ఫార్మా ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, ఐటీ, ఫార్మా రంగాలు 1.7-0.5 శాతం మధ్య లాభపడగా..  ఆటో 1 శాతం, రియల్టీ 0.35 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా స్టీల్‌ 6 శాతం జంప్‌చేయగా, బీపీసీఎల్‌, గెయిల్‌, సిప్లా, యాక్సిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫ్రాటెల్‌, ఐవోసీ, ఐసీఐసీఐ, టీసీఎస్‌ 3-1.3 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో గ్రాసిమ్‌, మారుతీ, టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్, కొటక్‌ బ్యాంక్‌ 2.3-0.7 శాతం మధ్య క్షీణించాయి. 

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో జిందాల్‌ స్టీల్‌, ఎంసీఎక్స్‌, అరబిందో, సీజీ పవర్‌, ఈక్విటాస్‌, టాటా గ్లోబల్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పీసీ జ్యువెలర్స్‌, ఆర్‌పవర్, రిలయన్స్‌ కేపిటల్‌, ఐఆర్‌బీ, ఐడీఎఫ్‌సీ, అదానీ పవర్, ఐఎఫ్‌సీఐ, ఐడీబీఐ, ఆర్‌ఈసీ, రిలయన్స్ ఇన్ఫ్రా 5.5-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు హుషారుగా కదులుతున్నప్పటికీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1229 నష్టపోగా.. 954 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో మిర్క్‌, కిసాన్‌, కుషాల్‌, ర్యాలీస్‌, డీవీఎల్‌, నౌకరీ, రాణే హోల్డింగ్స్‌, ఏఆర్‌వీ స్మార్ట్‌, ఏషియన్‌ ఆయిల్‌, కేడీడీఎల్‌, కాక్స్‌అండ్‌ కింగ్స్‌ తదితరాలు 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. Most Popular