కనిష్టం నుంచి కోలుకున్న రూపాయి

కనిష్టం నుంచి కోలుకున్న రూపాయి

ముందురోజు ఆరు వారాల కనిష్టాన్ని తాకిన దేశీ కరెన్సీ కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో తొలుత 13 పైసలు(0.2 శాతం) బలపడిన రూపాయి 70.12 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరికొంత పుంజుకుంది. డాలరుతో మారకంలో ప్రస్తుతం 16 పైసలు బలపడి 70.09 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గురువారం రూపాయి వరుసగా రెండో రోజు బలహీనపడింది. 39 పైసలు క్షీణించి 70.25 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో 70.27 వరకూ నీరసించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు జోరందుకోవడం, ముడిచమురు ధరలు పెరగడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించడం వంటి అంశాలు దేశీ కరెన్సీని బలహీనపరచినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. లండన్‌ మార్కెట్లో గురువారం బ్రెంట్ చమురు 2019లో తొలిసారి 75 డాలర్ల మార్క్‌ను అధిగమించింది.

రెండో రోజూ
గురువారం వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ఆరు వారాల తరువాత 70 మార్క్‌ దిగువకు చేరింది. డాలరుతో మారకంలో 39 పైసలు క్షీణించి 70.25 వద్ద ముగిసింది. బుధవారం సైతం రూపాయి 24 పైసలు క్షీణించి 69.86 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి నీరసిస్తూ వస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బుధవారం హైజంప్‌ చేసింది. 98.19ను తాకింది. ఇంతక్రితం 2017 మేలో మాత్రమే డాలరు ఈ స్థాయికి చేరింది. మరోపక్క డాలరుతో మారకంలో యూరో 1.115కు నీరసించింది. ఇది 18 నెలల కనిష్టంకాగా.. ఈ ప్రభావం సైతం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి.Most Popular