క్యూ4- జీహెచ్‌సీఎల్‌ దూకుడు

క్యూ4- జీహెచ్‌సీఎల్‌ దూకుడు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో కమోడిటీ కెమికల్స్‌ కంపెనీ జీహెచ్‌సీఎల్‌ లిమిటెడ్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో జీహెచ్‌సీఎల్‌ కౌంటర్‌ లాభాలతో కళకళలాడుతోంది. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.2 శాతం జంప్‌చేసి రూ. 254 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 9 శాతం పురోగమించి రూ. 264ను సైతం అధిగమించింది. ఈ కౌంటర్లో ఇప్పటివరకూ 10 లక్షలకుపైగా షేర్లు చేతులుమారడం గమనార్హం! వివరాలు చూద్దాం..

రూ. 5 డివిడెండ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీహెచ్‌సీఎల్‌ నికర లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 119 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పెరిగి రూ. 915 కోట్లకు చేరింది. నిర్వహణ (ఇబిటా) మార్జిన్లు 25.5 శాతం నుంచి 26.3 శాతానికి బలపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా సోడా యాష్‌గా పిలిచే అన్‌హైడ్రస్ సోడియం కార్బోనేట్‌ను జీహెచ్‌సీఎల్‌ తయారు చేస్తుంది. డిటర్జెంట్స్‌, గ్లాస్‌ తయారీ పరిశ్రమల్లో ముడిసరుకుగా సోడా యాష్‌ను వినియోగించే విషయం విదితమే.Most Popular