క్యూ4- యాక్సిస్ అప్‌- మారుతీ వీక్‌

క్యూ4- యాక్సిస్ అప్‌- మారుతీ వీక్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ లాభాలతో కళకళలాడుతోంది. అయితే గతేడాది క్యూ4(జనవరి-మార్చి) పనితీరు నిరాశ పరచడంతో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు తలెత్తుతున్నాయి. వివరాలు చూద్దాం..

యాక్సిస్‌ బ్యాంక్‌
గతేడాది చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో యాక్సిస్‌ బ్యాంక్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. రూ. 1505 నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 2189 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం సైతం 21 శాతం ఎగసి రూ. 5705 కోట్లను అధిగమించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.75 శాతం నుంచి 5.26 శాతానికి బలహీనపడగా.. నికర ఎన్‌పీఏలు సైతం 2.36 శాతం నుంచి 2.06 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 2 శాతం పుంజుకుని రూ. 755 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 765 వరకూ ఎగసింది.

Related image

మారుతీ సుజుకీ
ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో మారుతీ నికర లాభం 4.6 శాతం క్షీణించి రూ. 1796 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1.4 శాతం పెరిగి రూ. 21459 కోట్లను తాకింది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. పన్ను వ్యయాలు రూ. 752 కోట్ల నుంచి రూ. 516 కోట్లకు తగ్గాయి. వాటాదారులకు షేరుకి రూ. 80 డివిడెండ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 2 శాతం క్షీణించి రూ. 6769 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 6750 వరకూ నీరసించింది. ఫలితాల నేపథ్యంలో గురువారం సైతం ఈ షేరు బలహీనపడిన సంగతి తెలిసిందే.Most Popular