నేడు సానుకూల ఓపెనింగ్‌?! 

నేడు సానుకూల ఓపెనింగ్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 11,745 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇండస్ట్రియల్‌ కౌంటర్లలో అమ్మకాల కారణంగా గురువారం అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ డోజోన్స్‌ డీలాపడగా.. టెక్నాలజీ అండతో నాస్‌డాక్‌ లాభాలతో ముగిసింది. అంతకుముందు యూరోపియన్‌ మార్కెట్లు నష్టాలతో నిలవగా.. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. కాగా.. మే డెరివేటివ్‌ సిరీస్‌ నేటి నుంచి ప్రారంభంకానుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 

చివర్లో అమ్మకాల షాక్‌
గురువారం చివరి అర్ధగంటలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఖంగుతిన్నాయి. వెరసి సెన్సెక్స్‌ 324 పాయింట్లు పతనమై 38,731కు చేరింది. నిఫ్టీ సైతం 84 పాయింట్లు కోల్పోయి 11,642 వద్ద ముగిసింది. మిశ్రమ ప్రపంచ సంకేతాలు, ఏప్రిల్‌ ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన మార్కెట్లు రోజులో అధిక సమయం కన్సాలిడేషన్‌ బాటలో సాగాయి. అయితే ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో లాభాల నుంచి నష్టాల్లోకి ప్రవేశించాయి. ముడిచమురు ధరల సెగతో దేశీ కరెన్సీ రూపాయి మరోసారి డీలాపడింది. సాంకేతికంగా కీలకమైన 70 దిగువకు చేరింది. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,578 పాయింట్ల వద్ద, తదుపరి 11,515 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,751 పాయింట్ల వద్ద, తదుపరి 11,860 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29363, 29,164 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 29,909, 30,256 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 3786 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4067 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. కాగా.. బుధవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 975 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 657 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular