హెక్సావేర్‌- ఏసీసీ.. క్యూ4 జోష్‌

హెక్సావేర్‌- ఏసీసీ.. క్యూ4 జోష్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఓవైపు సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌.. మరోవైపు సిమెంట్‌ రంగ దిగ్గజం ఏసీసీ లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. కాగా.. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో నేటి ట్రేడింగ్‌లో పలు సిమెంట్ రంగ షేర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం...

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ నికర లాభం 26 శాతం ఎగసి దాదాపు రూ. 119 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం పెరిగి రూ. 509 కోట్లను తాకింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 138 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం 18 శాతం పెరిగి రూ. 1260 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో హెక్సావేర్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3.25 శాతం జంప్‌చేసి రూ. 344 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 62.59% వాటా ఉంది.

Image result for ACC Ltd

ఏసీసీ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఏసీసీ లిమిటెడ్‌ నికర లాభం 38 శాతం ఎగసి రూ. 346 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పెరిగి రూ. 3919 కోట్లను అధిగమించింది. దీనికితోడు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో సిమెంట్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏసీసీ లిమిటెడ్‌ షేరు 3 శాతం పుంజుకుని రూ. 1651 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1665 వరకూ ఎగసింది. కాగా ఫలితాల నేపథ్యంలో ముందురోజు ఈ షేరు 4 శాతం నీరసించడం గమనార్హం!Most Popular