చక్కెర షేర్లు.. యమా స్వీట్.. టేస్టీ

చక్కెర షేర్లు.. యమా స్వీట్.. టేస్టీ

కొద్ది రోజులక్రితం భారీ లాభాలతో తీపెక్కిన షుగర్‌ షేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో దాదాపు చక్కెర తయారీ కంపెనీల షేర్లన్నీ భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో కళకళలాడుతున్నాయి. కాగా.. ప్రస్తుతం చక్కెర తయారీ పరిశ్రమ దిద్దుబాటులోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు అక్టోబర్‌ నుంచి మొదలుకానున్న సీజన్‌లో చెరకు దిగుబడి తగ్గే అవకాశమున్నట్లు సహకార చక్కెర మిల్లుల ఫెడరేషన్‌ అభిప్రాయపడుతోంది. సగటుకంటే తక్కువగా నమోదుకానున్న వర్షపాతం ప్రభావం చూపవచ్చని భావిస్తోంది. రుతుపవనాలు మందగిస్తే.. చెరకు పంట దిగుబడేకాకుండా చక్కెర రికవరీ సైతం నీరసించే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇతర వివరాలు చూద్దాం..

తగ్గనున్న ఉత్పత్తి
ఈ సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 5.5 శాతం తక్కువగా 30.7 మిలియన్‌ టన్నులకు పరిమితంకావచ్చని షుగర్‌ మిల్లుల అసోసియేషన్‌(ISMA) అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో చెరకు సాగు తగ్గడం, సుగర్‌కేన్‌ జ్యూస్‌, మొలాసిస్‌కు పంట తరలిపోవడం వంటి అంశాలు దీనికికారణంకానున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉంటే..  ప్రభుత్వం ఎగుమతులకు ప్రోత్సాహకాలు ప్రకటించడానికితోడు, ఇటీవల మెరుగైన ఫలితాలు ప్రకటిస్తున్న పలు కంపెనీలు ఇకపై మరింత పటిష్ట పనితీరును చూపే అవకాశమున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇందుకు డిస్టిల్లరీ, కోజనరేషన్‌ విభాగాల రియలైజేషన్లు మెరుగుపడటం సహకరించనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌ (అక్టోబర్‌ 2018- సెప్టెంబర్‌ 2019)లో షుగర్‌ మిల్లుల నిర్వహణ మార్జిన్లు 3-4 శాతంమేర మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నారు.  

రేసు గుర్రాలే..
ప్రస్తుతం అన్ని షుగర్‌ స్టాక్స్‌కూ డిమాండ్‌ కనిపిస్తోంది. ఎన్‌ఎస్ఈలో ఉత్తమ్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 132కు చేరగా.. ఇంట్రాడేలో రూ. 135ను తాకింది. అవధ్‌ 4 శాతం పెరిగి రూ. 457 వద్ద కదులుతోంది. తొలుత రూ. 469 వరకూ ఎగసింది. ధంపూర్‌ 5 శాతం బలపడి రూ. 225కు చేరింది. ఇంట్రాడేలో రూ. 231ను తాకింది. ఇదే విధంగా దాల్మియా భారత్‌ 6 శాతం పురోగమించి రూ. 116కు చేరింది. ఇంట్రాడే గరిష్టం రూ. 120కాగా.. బలరామ్‌పూర్ 4 శాతం లాభంతో రూ. 146 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 150 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ద్వారికేష్‌ 4.4 శాతం జంప్‌చేసి రూ. 29 వద్ద, మవానా 5 శాతం పుంజుకుని రూ. 46వద్ద, కేసర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 5 శాతం వృద్ధితో రూ. 30 వద్ద ట్రేడవుతున్నాయి. బీఎస్‌ఈలో డీసీఎం శ్రీరామ్‌ ఇండస్ట్రీస్‌ 4 శాతం ఎగసి రూ. 185కు చేరింది. 

పెన్నీ స్టాక్స్‌  జోరు
షుగర్‌ పరిశ్రమకు చెందిన పెన్నీ స్టాక్స్‌లో శక్తి షుగర్స్‌ 2.5 శాతం పెరిగి రూ. 11.25 వద్ద, రాణా షుగర్స్‌ 3 శాతం ఎగసి రూ. 3.35 వద్ద, బజాజ్‌ హిందుస్తాన్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 8.75 వద్ద, శ్రీ రేణుకా 5 శాతం పుంజుకుని రూ. 11.2 వద్ద, ధరణి 5 శాతం పురోగమించి రూ. 11.50 వద్ద, రాజ్‌శ్రీ షుగర్స్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 24 వద్ద ట్రేడవుతున్నాయి. తిరూ అరూరన్ 5 శాతం పెరిగి రూ. 14.5ను తాకగా.. శింభోలీ 8 శాతం దూసుకెళ్లి రూ. 11.7 వద్ద కదులుతోంది. ఇక బీఎస్‌ఈలో ఉగర్‌ షుగర్‌ 4 శాతం లాభంతో రూ. 14.70కు చేరింది.Most Popular