రేట్లు పెంచేందుకు.. 'జియో' రెడీ అయిందా?

రేట్లు పెంచేందుకు.. 'జియో'  రెడీ అయిందా?

దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం రిలయన్స్ జియో . అత్యధిక నెట్ స్పీడ్, 4G సేవలు, ఆండ్రాయిడ్ ఫీచర్లతో దేశం మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన ఘనత రిలయన్స్ జియోది. జియో  రాకతో మిగతా పోటీ టెలికాం ఆపరేటర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వారు తేరుకునే లోపు జరగాల్సిన నష్టం వారికి జరిగిపోయింది. అతి తక్కువ రేట్లకే నెట్ సేవలు, కాల్ టారిఫ్లతో జియో మిగతా పోటీ సంస్థలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. దాదాపు 30 కోట్లకు పైగా కస్టమర్లు, విస్తారమైన నెట్‌వర్క్,1,75,000 టవర్లు కలిగి ఉన్న జియో తన నిర్వాహణ సామర్ధ్యం పెంచుకోడానికి, ఆపరేషనల్ వ్యయాలను తట్టుకోడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచనుందా? , రేట్లను సవరించి తద్వారా నిధులను సమీకరించుకోనుందా..? అవుననే అంటున్నాయి.. ప్రముఖ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు. 

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్.. జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తన క్లయింట్స్‌కు తెలియజేసింది.ముందు ముందు రిలయన్స్ జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉన్నట్టు తోస్తుందని జేపీ మోర్గాన్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు రూ.9,000 కోట్లు అవసరం ఉంది. దీర్ఘకాల కెపాసిటీ లీజింగ్ డీల్స్‌కు, ఫైబర్-టవర్ అసెట్స్ డీమెర్జ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్  పర్పస్ వెహికిల్ (SPV) వంటి వాటి కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్టు సమాచారం. వాస్తవానికి రిలయన్స్ జియో రాకలో దేశీయ టెలికం రంగంలో ధరలు దిగొచ్చాయి. చౌక ధరల వ్యూహంతో జియో చాలా మంది సబ్‌స్క్రైబర్లను చేజిక్కించుకుంది. అయితే గత 16 నెలలుగా చూస్తే టెలికంలో ధరలు స్థిరీకరణకు గురయ్యాయి. టెల్కోల మధ్య పోటీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ధరలు పైకి కదిలే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా రానున్న కాలంలో టారిఫ్ ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే  ఈ రెండు కంపెనీలు దాదాపు రూ. 25,000 కోట్ల నిధుల సమీకరణకు యత్నాలు మొదలు పెట్టాయి.  జియోతో పోటీ తట్టకోడం కోసం, మరియు దేశ వ్యాప్తంగా తమ 4G సేవలను విస్తరించడం కోసం ఎయిర్ టెల్, వోడా ఫోన్ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు సామర్థ్యం పెంపునకు నిధుల సమీకరణ వేటలో ఉన్నాయని, దీని వల్ల జియో ధరల వ్యూహం మారోచ్చని కోటక్ సెక్యూరిటీస్ కూడా అంచనా వేస్తోంది. 
2016 సెప్టెంబర్ లో ప్రారంభమైన జియో టెలికాం రంగంలో సంచలనంగా మారింది. ఇతర సంస్థలను తోసి రాజని దాదాపు 306.7 మిలియన్ కస్టమర్లను సొంతం చేసుకున్న ముఖేష్ అంబానికి చెందిన ఈ సంస్థ 2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో నెట్ ప్రాఫిట్‌లో దాదాపు 65శాతం వృద్ధిని కనబరిచింది. మార్చ్ 2019 కల్లా దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో రూ. 11,100 కోట్ల రెవిన్యూను సాధించింది. అయితే నెట్‌వర్క్ ఆపరేటింగ్ వ్యయాలు మాత్రం దాదాపు 88శాతం జంప్‌ చేశాయి. టవర్స్ , నెట్ వర్క్ ఆపరేటింగ్ వ్యయాల కోసమే రిలయన్స్ జియోకు దాదాపు రూ. 9000 కోట్ల అవసరం ఉంది. దీంతో రిలయన్స్ జియో తన టారిఫ్‌లను సవరించే ఉద్దేశ్యాలు ఉన్నట్టు కనబడతున్నాయని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఒకే ప్లాన్‌తో మొబైల్ డాటా, నెట్ కనెక్షన్, టీవీ ఛానల్స్ కనెక్షన్లు వంటి ఆఫర్‌ను తెరమీదకు తీసుకురాబోతుందని వార్తలు వస్తున్నాయి. మిగతా టెల్కోలకు పోటీగా రిలయన్స్ జియో ఎంచేయబోతుందో వేచి చూడాలి.

 Most Popular