ఆటుపోట్లతో- షుగర్‌ షేర్లు అప్‌

ఆటుపోట్లతో- షుగర్‌ షేర్లు అప్‌

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ 36 పాయింట్లు పెరిగి 39,091కు చేరింది. నిఫ్టీ సైతం 19 పాయింట్లు బలపడి 11,745 వద్ద ట్రేడవుతోంది. ముడిచమురు ధరల సెగ కారణంగా దేశీ కరెన్సీ రూపాయి మరోసారి డీలాపడింది. సాంకేతికంగా కీలకమైన 70 దిగువకు చేరింది. మరోవైపు ఏప్రిల్‌ ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ ముగింపు నేపథ్యంలో మార్కెట్లు నేడు ఊగిసలాటకు లోనుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. బుధవారం ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ కారణంగా మార్కెట్లు లాభాల హైజంప్‌ చేసిన విషయం విదితమే.

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఆటో 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్, టైటన్‌, ఎల్‌అండ్‌టీ, ఐబీ హౌసింగ్‌, సన్‌ ఫార్మా, ఐటీసీ 3-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, మారుతీ, బజాజ్‌ ఆటో, ఓన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ, ఎంఅండ్‌ఎం 3-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఆర్‌పవర్, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, ఐసీఐసీఐ ప్రు, రిలయన్స్‌ ఇన్ఫ్రా, బీహెచ్‌ఈఎల్‌, డీసీబీ బ్యాంక్‌ 4-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జెట్‌ ఎయిర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఐడియా, సుజ్లాన్‌, పేజ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, ఇండియన్‌ బ్యాంక్‌, మారికో 4-1 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు సానుకూలంగా కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 901 లాభపడగా.. 484 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో షుగర్‌ షేర్లు సందడి చేస్తున్నాయి.  వీటో, ఉత్తమ్ షుగర్‌, దాల్మియా షుగర్‌, వీఎస్‌ఎస్‌ఎల్‌, రాణే హోల్డింగ్స్‌, బలరామ్‌పూర్, ధంపూర్‌, జేకే అగ్రి, ద్వారికేష్‌, ప్రాజ్‌, అవధ్‌, స్పైస్‌జెట్‌ తదితరాలు 7.5-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి.  Most Popular