రుపీ@ 70- డాలర్‌ ఇండెక్స్‌ అప్‌

రుపీ@ 70- డాలర్‌ ఇండెక్స్‌ అప్‌

వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో తాజాగా 70 మార్క్‌ దిగువకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 14 పైసలు క్షీణించి 70ను తాకింది. ప్రస్తుతం 70.03 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బుధవారం 24 పైసలు క్షీణించి 69.86 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో ఒక దశలో 69.97 వరకూ పతనమైంది. ఇది నాలుగు నెలల కనిష్టంకావడం గమనార్హం! అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఐదు నెలల గరిష్టాలకు చేరడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను బంద్‌ చేయమంటూ ఆసియా దేశాలను అమెరికా ఆదేశించడం వంటి అంశాలు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

డాలరు జూమ్‌
ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బుధవారం హైజంప్‌ చేసింది. 98.19ను తాకింది. ఇంతక్రితం 2017 మేలో మాత్రమే డాలరు ఈ స్థాయికి చేరింది. మరోపక్క డాలరుతో మారకంలో యూరో 1.115కు నీరసించింది. ఇది 18 నెలల కనిష్టంకాగా.. ఈ ప్రభావం సైతం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. కాగా.. నేడు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు స్పీడందుకోవడంతో సోమవారం 32 పైసలు క్షీణించిన రూపాయి మంగళవారం స్వల్పంగా 5 పైసలు పుంజుకుంది. తిరిగి బుధవారం డీలా పడింది.Most Popular