రికార్డ్‌ గరిష్టం నుంచి వెనకడుగు

రికార్డ్‌ గరిష్టం నుంచి వెనకడుగు

ప్రధానంగా ఇంధన రంగ కౌంటర్లలో అమ్మకాలు నమోదుకావడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ మంగళవారం సరికొత్త గరిష్టాలను తాకినప్పటికీ.. బుధవారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ కారణంగా వెనకడుగు వేశాయి. ఫలితంగా డోజోన్స్‌ 59 పాయింట్లు(0.22 శాతం) క్షీణించి 26,597కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 6 పాయింట్ల(0.22 శాతం) నష్టంతో 2,927 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం 19 పాయింట్లు(0.23 శాతం) నీరసించి 8,121 వద్ద స్థిరపడింది. ఈకామర్స్ దిగ్గజం ఈబే ఇంక్ పటిష్ట ఫలితాలు సాధించడంతో ఇంట్రాడేలో నాస్‌డాక్‌ మరోసారి కొత్త గరిష్టానికి చేరినప్పటికీ ఆ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో డీలాపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మార్కెట్లు ముగిశాక
బుధవారం మార్కెట్లు ముగిశాక ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ క్యూ1 ఫలితాలు ప్రకటించాయి. నేడు బ్లూచిప్‌ కంపెనీలు ఇంటెల్‌ కార్ప్‌, అమెజాన్‌.కామ్‌ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. వ్యయాలు పెరిగిన కారణంగా మార్జిన్లు మందగించడంతో నిర్మాణ రంగ పరికరాల దిగ్గజం కేటర్‌పిల్లర్‌ షేరు 3 శాతం క్షీణించింది. ఆదాయం అంచనాలను చేరకపోవడంతో వైర్‌లెస్‌ సేవల సంస్థ ఏటీఅండ్‌టీ ఇంక్‌ 4 శాతం పతనమైంది. కాగా.. 2019 ఆదాయ అంచనాలను పెంచడంతో ఈబే ఇంక్‌ 5.5 శాతం జంప్‌చేసింది. చెవ్రాన్‌ కార్ప్‌ టేకోవర్‌కు ఆక్సిడెంటల్‌ పెట్రోలియం చెక్‌ పెట్టడంతో అనడార్కో పెట్రోలియం షేరు దాదాపు 12 శాతం దూసుకెళ్లింది.

డాలర్ స్పీడ్
బుధవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే 0.7 శాతం, ఫ్రాన్స్‌ 0.3 శాతం చొప్పున నీరసించగా.. జర్మనీ 0.65 శాతం ఎగసింది. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇండొనేసియా, చైనా, కొరియా, సింగపూర్‌ 0.75-0.2 శాతం మధ్య క్షీణించగా.. హాంకాంగ్‌ యథాతథంగా కదులుతోంది. అయితే జపాన్‌ 0.4 శాతం పుంజుకోగా.. థాయ్‌లాండ్‌, తైవాన్‌ నామమాత్ర లాభాలతో ట్రేడవుతున్నాయి. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 2017 మే తరువాత గరిష్టం 98.19కు చేరగా.. డాలరుతో మారకంలో యూరో 1.115కు నీరసించింది. నేడు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది.Most Popular