మరోసారి ఫ్లాట్‌ ఓపెనింగ్‌?! 

మరోసారి ఫ్లాట్‌ ఓపెనింగ్‌?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 13 పాయింట్ల స్వల్ప క్షీణతతో 11,724 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇంధన రంగ కౌంటర్లలో అమ్మకాలతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఏప్రిల్‌ ఎఫ్‌అండ్‌వో  సిరీస్‌ గడువు నేడు ముగియనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం షార్ట్‌ కవరింగ్‌ కారణంగా మార్కెట్లు హైజంప్‌ చేయడమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు.

మార్కెట్ల దూకుడు
మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు తొలి నుంచీ లాభాలతో కదిలాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ చివర్లో జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ 490 పాయింట్లు జంప్‌చేసి 39,055కు చేరగా.. నిఫ్టీ సైతం 150 పాయింట్లు జమ చేసుకుని 11,726 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్‌ మరోసారి 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,623 పాయింట్ల వద్ద, తదుపరి 11,520 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,785 పాయింట్ల వద్ద, తదుపరి 11,844 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 29559, 29,257 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,039, 30,217 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో రూ. 237 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ద్వారా మంగళవారం యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) బుధవారం తిరిగి పెట్టుబడుల బాట పట్టారు. దాదాపు రూ. 975 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. కాగా.. మంగళవారం రూ. 198 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) బుధవారం రూ. 657 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular