కొనుగోళ్ల కిక్‌- మార్కెట్లు హైజంప్‌

కొనుగోళ్ల కిక్‌- మార్కెట్లు హైజంప్‌

మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు తొలి నుంచీ లాభాలతో కదిలాయి. మధ్యలో కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ చివర్లో జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ 490 పాయింట్లు జంప్‌చేసి 39,055కు చేరగా.. నిఫ్టీ సైతం 150 పాయింట్లు జమ చేసుకుని 11,726 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్‌ మరోసారి 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. ముడిచమురుముడిచమురు ధరల సెగ, ఎఫ్‌అండ్‌వో ముగింపు తదితర అంశాల నేపథ్యంలో మంగళవారం వరుసగా మూడో రోజు మార్కెట్లు డీలాపడిన విషయం విదితమే. కాగా.. గురువారం డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఆటో మాత్రమే(0.4 శాతం) నీరసించగా.. బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1.3 శాతం చొప్పున ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో అల్ట్రాటెక్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్, ఓఎన్‌జీసీ, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టాటా మోటార్స్‌ 3.2 శాతం పతనంకాగా.. హీరో మోటో, మారుతీ, కోల్‌ ఇండియా, సిప్లా, పవర్‌గ్రిడ్, బ్రిటానియా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు ఉత్సాహంగా ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకూ డిమాండ్ పుట్టింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.45 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1249 లాభపడగా.. 1248 నష్టాలలో ముగిశాయి.  

ఎఫ్‌పీఐల అమ్మకాలు
కొద్ది రోజులుగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం యూటర్న్ తీసుకున్నారు. రూ. 237 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 198 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా..  నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌పీఐలు స్వల్పంగా రూ. 73 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 68 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే. Most Popular