సెంచురీ విక్రయం- ఐబీ రియల్టీకి కిక్‌

సెంచురీ విక్రయం- ఐబీ రియల్టీకి కిక్‌

లండన్‌లోగల సెంచురీ ప్రాపర్టీని విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ కౌంటర్ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. లండన్‌లోగల సెంచురీని విక్రయించేందుకు నిర్ణయించినట్లు ఐబీ రియల్టీ తాజాగా పేర్కొంది. తద్వారా దేశీయంగా ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ) మార్కెట్లపైనే దృష్టి సారించనున్నట్లు తెలియజేసింది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగనుండటం(బ్రెక్సిట్‌)తో తలెత్తిన సమస్యలు, అనిశ్చితి వంటి ప్రతికూలతల కారణంగా లండన్‌ ప్రాపర్టీని విక్రయించేందుకు నిర్ణయించినట్లు వివరించింది.

20 కోట్ల పౌండ్లు
16.15 కోట్ల పౌండ్లకు కొనుగోలు చేసిన లండన్‌ ప్రాపర్టీ విలువను ఇటీవల సీబీఆర్‌ఈ లండన్‌ 18.9 కోట్ల పౌండ్లుగా మదింపు చేసినట్లు ఐబీ రియల్టీ పేర్కొంది. 20 కోట్ల పౌండ్లకు ఈ ప్రాపర్టీని విక్రయించడం ద్వారా రుణ భారాన్ని రూ. 4590 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు తగ్గించుకునే వీలున్నట్లు తెలియజేసింది. కాగా.. పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ తదితర సంస్థలకు ఇండియాబుల్స్‌ రియల్టీలో మాతృ సంస్థ వాటా విక్రయించే అవకాశమున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాబుల్స్‌ రియల్టీ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 8.4 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 120 వరకూ ఎగసింది. 

భారీ ర్యాలీ
గత నెల రోజులుగా ఇండియాబుల్స్‌ రియల్టీ ర్యాలీ బాటలో సాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న 52 వారాల కనిష్టం రూ. 63ను తాకిన ఈ షేరు తదుపరి జోరందుకుంది. వెరసి గత నెలన్నర రోజుల్లో 90 శాతం దూసుకెళ్లింది.Most Popular