శాస్కన్‌ టెక్‌- ఓఎన్‌జీసీ -వెలుగు

శాస్కన్‌ టెక్‌- ఓఎన్‌జీసీ -వెలుగు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ శాస్కన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా మరోపక్క.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)కు పటిష్ట ఫలితాలు ప్రకటించనుందన్న అంచనాలు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

శాస్కన్‌ టెక్నాలజీస్‌
గతేడాది చివరి త్రైమాసికంలో శాస్కన్‌ టెక్నాలజీస్‌ ఆకర్షణీయ పనితీరు చూపింది. నికర లాభం రూ. 18 కోట్ల నుంచి రూ. 27.5 కోట్లకు ఎగసింది. ఇది 52 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 12 శాతం పెరిగి రూ. 135 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ.7.50 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో గతేడాదిలో వాటాదారులకు మొత్తం రూ. 12.5 డివిడెండ్‌ చెల్లించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో శాస్కన్‌ టెక్నాలజీస్‌ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.4 శాతం జంప్‌చేసి రూ. 744 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 749 వరకూ ఎగసింది.

Image result for ongc

ఓఎన్‌జీసీ లిమిటెడ్‌
ఇంధన రంగ పీఎస్‌యూ ఓఎన్‌జీసీ గతేడాది చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలదన్న అంచనాలు వెలువడుతున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌-డిసెంబర్) నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 22671 కోట్లను తాకింది. చమురు విక్రయాలపై సబ్సిడీ భారం తగ్గుతున్న నేపథ్యంలో క్యూ4లో కంపెనీ గరిష్ట లాభాలను ఆర్జించే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరుకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.3 శాతం పెరిగి రూ. 168 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 170 వరకూ ఎగసింది. ఇది 6 నెలల గరిష్టంకాగా.. సోమవారం సైతం ఈ షేరు 4 శాతం పుంజుకోవడం విశేషం! Most Popular