జియో ఇంటర్నెట్+ల్యాండ్‌లైన్+కేబుల్ టీవీ.. అంత చవకా?

జియో ఇంటర్నెట్+ల్యాండ్‌లైన్+కేబుల్ టీవీ.. అంత చవకా?
 • జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, కేబుల్ టీవీ
 • రూ. 600లకే మూడు సర్వీసులను అందించనున్న జియో!
 • ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని నగరాల్లో ఇంటర్నెట్ సర్వీసులు
 • త్వరలో టెలిఫోన్, కేబుల్ నెట్వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్న
 • మరో మూడు నెలల్లో కమర్షియల్ సర్వీసులు ప్రారంభమ్యే అవకాశం

జియో అంటూ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్... ఇప్పుడు ఫైబర్ విభాగంలో కూడా ప్రవేశించనున్న విషయం తెలిసిందే. గిగాఫైబర్ అంటూ పలు రకాల సర్వీసులను ఒకే గూటి కిందకు తెస్తున్నామని... రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ గతేడాది వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పైలెట్ ప్రాజెక్టుగా సేవలు అందిస్తుండగా... మరో మూడు నెలలలో గిగాఫైబర్ వాణిజ్య సేవలు మొదలవుతాయని తెలుస్తోంది. అయితే.. బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, కేబుల్ టీవీ... ఈ మూడు సర్వీసులకు కలిపి.. కేవలం 600 రూపాయలకే అందిస్తూ.. మరో సెన్సేషన్‌కు జియో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

 

రిలయన్స్ జియో గిగాఫైబర్‌ ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. న్యూఢిల్లీ, ముంబైలతో పాటు హైద్రాబాద్‌లో కూడా కొన్ని ప్రాంతాలలో పైలెట్ దశలో సర్వీసులు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి సెకనుకు 100 మెగాబైట్ల వేగంతో.. నెలగు 100 గిగాబైట్ల ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నారు. ఇందుకోసం రూ. 4,500లను రూటర్ ఛార్జీలుగా తీసుకుంటుండగా... వాణిజ్య సేవలు ప్రారంభించేవరకూ... వీరికి పూర్తిగా సేవలు ఉచితంగా అందనున్నాయి. ఈ పైలెట్ ప్రాజెక్టులో ఇంటర్నెట్ సేవలు మాత్రమే అందిస్తుండగా... మరో మూడు నెలల కాలంలోనే టెలిఫోన్, టెలివిజన్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

రూ. 600లకే అన్ని సర్వీసులు
కాల్స్, ఎస్ఎంఎస్‌లను పూర్తిగా అందిస్తూ.. ఇంటర్నెట్ డేటా ప్లాన్స్‌కు మాత్రమే అతి తక్కువ రుసుములను ఛార్జ్ చేస్తూ... డేటాగిరీ అంటూ టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం దెబ్బకు..  పలు టెలికాం కంపెనీలు మార్కెట్ నుంచి అంతర్ధానం అయిపోయాయి. మరికొన్ని కంపెనీలు ఇతర సంస్థలలో విలీనం అయిపోయి.. నిలబడేందుకే నానాపాట్లు పడుతున్నాయి. ఇప్పుడు 
ఈ మూడు సేవలకు నెలవారీగా ఛార్జ్‌ను రూ. 600గా నిర్ణయించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇవీ ఫెసిలిటీస్

 • జియో కాలింగ్ మాదిరిగానే, ల్యాండ్‌లైన్ నుంచి కూడా అపరిమిత కాలింగ్ ఉచితంగానే అందించనుంది గిగాఫైబర్.
 • ఇక టెలివిజన్ ఛానల్స్‌ను ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ ద్వారా అందించనున్నారు.
 • వీటిని ఒ.ఎన్.టి(ఆప్టికల్ నెట్వర్క్ టెర్మినల్) బాక్స్ రూటర్ ద్వారా అందిస్తారు.
 • దీనితో ఒక్కో రూటర్ నుంచి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు వంటి 45 స్మార్ట్ పరికరాలను అనుసంధానం చేయవచ్చు. 
 • వీటితో పాటు గేమింగ్, క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్‌లు, స్మార్ట్ హోమ్ సిస్టమ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.
 • అయితే 600 ఛానెళ్లు, ల్యాండ్‌లైన్, 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లకు బేస్ ఫేర్ రూ. 600గా ఉంటుందని.. ఆపై ఎంపిక చేసుకున్న స్మార్ట్ హోమ్ సేవలకు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం రూ. 1000 వరకు రెంటల్స్ ఉంటాయని తెలుస్తోంది.

100 ఎంబీపీఎస్ నుండి 1 గిగాబైట్ వరకూ వేగంతో జియో గిగాఫైబర్ సేవలు అందుబాటులోకి రానుంది. సీసీటీవీ ఫుటేజ్‌ను క్లౌడ్ ద్వారా ఏ పరికరం ద్వారా అయినా యాక్సెస్ చేసే సదుపాయం కల్పించనున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 1,100పైగా పట్టణాలు, నగరాలలో గిగా ఫైబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. ఇందుకోసం డెన్ నెట్వర్క్స్, హాథ్‌వే కేబుల్, డేటాకామ్ లిమిటెడ్ వంటి కంపెనీలతో రూ. 5230 కోట్ల విలువైన ఒప్పందాలను రిలయన్స్ జియో చేసుకుంది. జియోకు ప్రధాన పోటీ కంపెనీ అయిన ఎయిర్టెల్.. టాప్ 100 సిటీస్ పైనే దృష్టి నిలపగా.. జియో మాత్రం దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాలు అన్నింటిలోనూ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. గిగాఫైబర్ విస్తృతంగా వ్యాప్తి చెందడంతో పాటు.. త్వరితంగా కస్టమర్లను పొందడంలో.. ఇది అత్యంత కీలకం కానుంది. Most Popular